Errabelli: టీఆర్ఎస్ లో ఎన్నో అవమానాలు.. రాజీనామా చేస్తున్నా: మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు
- కనీస గుర్తింపు లేనప్పుడు టీఆర్ఎస్ లో ఉండి ఏం లాభమన్న ప్రదీప్ రావు
- సంస్కారం లేని నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని వ్యాఖ్య
- ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందంటున్న రాజకీయ వర్గాలు
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. అన్నీ సహించి ఇన్నాళ్లూ కొనసాగినా ప్రజలకు తాను ఏమీ చేయలేకపోతున్నానన్న ఆవేదన ఒక్కటే మిగిలిందని వ్యాఖ్యానించారు. కనీస గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఉండి ఏం లాభమని, సంస్కారం లేని నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని ప్రదీప్ రావు పేర్కొన్నారు.
ఎన్నో రకాలుగా అవమానించారు
టీఆర్ఎస్ లో తనకు ఎన్నో రకాలుగా అవమానాలు ఎదురయ్యాయని ప్రదీప్ రావు పేర్కొన్నారు. తనతో పాటు తన అనుచరుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించినా భరించామన్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ పెద్దలు పట్టించుకోలేదని వాపోయారు. వీటిని భరించలేక పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు.
బీజేపీలో చేరే అవకాశం ఉందంటున్న రాజకీయవర్గాలు
2018 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. తర్వాత ఎమ్మెల్సీ పదవి వస్తుందని భావించారు. కానీ ఇవేవీ నెరవేరకపోవడంతో కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్‌కు రాజీనామా చేయబోతున్నట్టు ప్రదీప్ రావు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఆయనను బుజ్జగించేందుకు టీఆర్ఎస్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, దీనితో చెప్పినట్టుగానే రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకోలేదని ఎర్రబెల్లి ప్రదీప్ రావు పేర్కొన్నా.. ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని రాజకీయవర్గాలు వెల్లడిస్తున్నాయి.