India: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు మరో మూడు స్వర్ణాలు

Three more gold medals for India in Commonwealth Games
  • బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ వేదికగా క్రీడలు
  • కొనసాగుతున్న భారత్ జోరు
  • బాక్సింగ్ లో రెండు పసిడి పతకాలు
  • ట్రిపుల్ జంప్ లో ఒక స్వర్ణం
  • బ్యాడ్మింటన్ ఫైనల్ చేరిన లక్ష్యసేన్
బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు కొనసాగుతోంది. ఇవాళ మరో రెండు స్వర్ణ పతకాలను భారత్ చేజిక్కించుకుంది. బాక్సింగ్ క్రీడాంశంలో అమిత్ పంఘాల్, నీతూ ఘంఘాస్ తమ కేటగిరీల్లో ఫైనల్స్ నెగ్గి పసిడి పతకాలను కైవసం చేసుకున్నారు. ట్రిపుల్ జంప్ లో ఎల్డోస్ పాల్ అద్భుత ప్రతిభ కనబర్చి స్వర్ణం అందుకున్నాడు. 

మహిళల బాక్సింగ్ 48 కిలోల విభాగంలో పోటీపడిన నీతూ ఘంఘాస్ ఫైనల్లో ఇంగ్లండ్ కు చెందిన డెమీ జేడ్ రెస్జాన్ ను 5-0తో మట్టి కరిపించింది. అటు, పురుషుల బాక్సింగ్ 51 కిలోల విభాగంలో అమిత్ పంఘాల్ ఇంగ్లండ్ బాక్సర్ కైరన్ మెక్ డొనాల్డ్ పై 5-0తో జయభేరి మోగించాడు. 

ఇక, అథ్లెటిక్స్ లో భారత ట్రిపుల్ జంపర్ ఎల్డోస్ పాల్ పసిడి పతకం గెలవగా, భారత్ కు చెందిన అబూబకర్ కు ఇదే క్రీడాంశంలో రజతం దక్కింది.  పసిడి పతకం గెలిచే క్రమంలో ఎల్డోస్ పాల్ తన అత్యుత్తమ ప్రదర్శన 17.03 మీటర్లు నమోదు చేయడం విశేషం. అబూబకర్ 17.02 మీటర్లతో రెండోస్థానంలో నిలిచాడు.
ఇవాళ అథ్లెటిక్స్ లో మరో రెండు కాంస్యాలు కూడా భారత్ ఖాతాలో చేరాయి. మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి, పురుషుల 10 వేల మీటర్ల నడకలో సందీప్ కుమార్ కాంస్యం నెగ్గారు. 

కాగా, బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో మరో పతకం ఖాయమైంది. భారత ఆశాకిరణం లక్ష్యసేన్ కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇవాళ జరిగిన సెమీఫైనల్లో సింగపూర్ కు చెందిన జియా హెంగ్ టేపై 2-1తో నెగ్గాడు. మరో సెమీస్ లో భారత్ స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, మలేసియాకు చెందిన ట్సే యోంగ్ ఎన్జీ ఆడుతున్నారు. ఈ మ్యాచ్ విజేతతో లక్ష్యసేన్ ఫైనల్లో తలపడతాడు.

India
Gold
Commonwealth Games
Boxing
Triple Jump

More Telugu News