Uttar Pradesh: ఓ కేసులో దోషిగా తేలిన యూపీ మంత్రి.. శిక్ష ప్రకటించడానికి ముందే కోర్టు నుంచి పరారీ!

UP minister fled from courtroom after guilty verdict
  • 1991 నాటి కేసులో దోషిగా తేలిన మంత్రి
  • శిక్షపై వాదనలు ప్రారంభం కావడానికి ముందే కోర్టు నుంచి వెళ్లిపోయిన మంత్రి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కోర్టు సిబ్బంది
  • ఆరోపణలను కొట్టిపడేసిన మంత్రి రాకేశ్ సచన్
ఓ కేసులో దోషిగా తేలిన ఉత్తరప్రదేశ్ మంత్రి.. న్యాయస్థానం శిక్ష విధించడానికి ముందే కోర్టు నుంచి అదృశ్యమయ్యారు. యూపీ రాజకీయాల్లో ఇప్పుడీ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న రాకేష్ సచన్.. గతంలో కాంగ్రెస్ నేత. యూపీ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి గెలిచిన ఆయనకు మంత్రి పదవి లభించింది. 

చట్ట విరుద్ధంగా ఆయన వద్ద ఓ ఆయుధం ఉన్నట్టు 1991లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ తర్వాత నిన్న కాన్పూరు కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించింది. ఆయనను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం.. శిక్ష విధించడానికి ముందే రాకేష్ కోర్టు నుంచి పరారయ్యారు. బెయిల్ బాండ్లు అందించకుండానే ఆయన కోర్టు నుంచి పరారైనట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలను మంత్రి తిరస్కరించారు.  

కోర్టు నుంచి మంత్రి పరారు కావడంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. రాకేశ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకోవడానికి ముందే ఆయన పరారయ్యారని అన్నారు. విధించదగిన శిక్షపై వాదనలు ప్రారంభం కావడానికి ముందే ఆయన కోర్టు గది నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు. దీనిపై కాన్పూరు సీనియర్ పోలీసు అధికారి ఏపీ తివారీ స్పందిస్తూ.. రాకేశ్ కోర్టు నుంచి పారిపోయినట్టు తమకు ఫిర్యాదు అందిందన్నారు. దర్యాప్తు చేపట్టామని, పూర్తయిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

రాకేశ్ పారిపోయినట్టు వార్తలు వచ్చిన కాసేపటికే ఆయన ఓ ట్వీట్ చేశారు. పొరుగు జిల్లాలో ఓ అధికారిక కార్యక్రమంలో తాను పాల్గొన్నానంటూ కొన్ని ఫొటోలను షేర్ చేశారు. తనపై ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, రాజకీయ ప్రేరేపితమని అన్నారు. ఉదయం 11 గంటల కన్నా ముందే కోర్టు నుంచి తాను బయటకు వెళ్లినట్టు చెప్పారు. ఇంకొంత సమయం పట్టేలా ఉందని న్యాయవాది చెప్పడంతో హాజరు మినహాయింపు దరఖాస్తు చేయాలని కోరి, అక్కడి నుంచి వెళ్లినట్టు వివరించారు. కావాలంటే కోర్టులోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించవచ్చన్నారు.
Uttar Pradesh
Kanpur
Rakesh Sachan

More Telugu News