Langya Henipavirus: లాంగ్యా హెనిపా... చైనాలో జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న కొత్త వైరస్
- చైనాలో పుట్టిన కరోనా
- ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం
- ఇప్పుడు చైనాలోనే మరో వైరస్ కలకలం
- 35 కేసులు నమోదు
యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఎంతెలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వైరస్ భూతానికి చైనానే పుట్టిల్లు. ఇప్పుడదే చైనాలో మరో కొత్త వైరస్ వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. ఆ వైరస్ పేరు లాంగ్యా హెనిపా. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నట్టుగా గుర్తించారు. దీని ద్వారా ఇప్పటికే చైనాలో 35 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరి నుంచి మరొకరికి సోకిందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. వీరికి జంతువుల నుంచే సోకి ఉంటుందని భావిస్తున్నారు.
లాంగ్యా హెనిపా వైరస్ సోకిన వారిలో ప్రధానంగా జ్వరం, దగ్గు, నీరసం, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పులు, వికారం వంటి లక్షణాలను గుర్తించారు. దాంతోపాటే ప్లేట్ లెట్స్ సంఖ్య పడిపోవడం, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. లాంగ్యా హెనిపా వైరస్ కేసులు చైనాలోని హెనాన్, షాంగ్ డాంగ్ ప్రావిన్స్ ల్లో నమోదయ్యాయి.