Narendra Modi: ప్రధాని మోదీ ఆస్తుల విలువ రూ.2.23 కోట్లు
- మోదీ ఆస్తి వివరాలు పీఎంవో సైట్లోకి అప్ లోడ్
- బ్యాంక్ డిపాజిట్ల రూపంలో మోదీ ఆస్తి
- భూమిని గతంలోనే దానం చేసిన మోదీ
- మోదీకి సొంత వాహనం లేదని పీఎంవో వెల్లడి
ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తుల వివరాలను తాజాగా పీఎంవో వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేశారు. అందులోని వివరాల ప్రకారం మోదీ పేరిట రూ.2.23 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ప్రధానంగా బ్యాంక్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. మోదీ పేరిట స్థిరాస్తులేవీ లేవు. గతంలో గాంధీనగర్ లో మోదీ పేరిట భూమి ఉండగా, ఆయన దాన్ని దానం చేశారు. ఆ భూమిలో మరో ముగ్గురితో కలిసి మోదీ యాజమాన్య హక్కులు పంచుకున్నారని, ఇప్పుడాయన ఎంతమాత్రం ఆ స్థలానికి యజమాని కాదని, తన భాగాన్ని విరాళంగా ఇచ్చేశారని వెబ్ సైట్లో వివరించారు.
కాగా, 2022 మార్చి 31 నాటికి మోదీ చేతిలో రూ.35,250 నగదు ఉన్నట్టు వెల్లడించారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకున్న నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల విలువ రూ.9,05,105 కాగా, రూ.1,89,305 విలువ చేసే బీమా పాలసీ మోదీ పేరిట ఉందని పీఎంవో వెబ్ సైట్లో వివరించారు.
ఇవే కాకుండా రూ.1.73 లక్షలు విలువ చేసే నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నట్టు తెలిపారు. మోదీ పేరిట ఎలాంటి వాహనాలు లేవని వెల్లడించారు. మోదీతో పాటు ఆయన క్యాబినెట్ సహచరులు కూడా తమ ఆస్తుల వివరాలు సమర్పించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చరాస్తుల విలువ రూ.2.54 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.2.97 కోట్లు అని వెల్లడైంది