Rudi Koertzen: క్రికెట్ ప్రపంచంలో విషాదం... రోడ్డు ప్రమాదంలో అంపైరింగ్ దిగ్గజం రూడీ కోర్జెన్ మృతి

Umpiring legend Rudi Koertzen died in a road mishap
  • గోల్ఫ్ టోర్నీ కోసం కేప్ టౌన్ వెళ్లిన రూడీ
  • తిరిగి వస్తుండగా ప్రమాదం
  • సెహ్వాగ్ తో అనుబంధం
  • దిగ్భ్రాంతి చెందిన సెహ్వాగ్
దక్షిణాఫ్రికాకు చెందిన అంతర్జాతీయ అంపైరింగ్ దిగ్గజం రూడీ కోర్జెన్ కన్నుమూశారు. ఓ రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. రూడీ వయసు 73 సంవత్సరాలు. ఐసీసీ ఎలైట్ అంపైర్ గా అనేక అంతర్జాతీయ మ్యాచ్ లకు రూడీ కోర్జెన్ అంపైర్ గా వ్యవహరించాడు. వివాదరహితుడిగా గుర్తింపు పొందాడు. ఆటగాళ్లతో ఎంతో సౌమ్యంగా వ్యవహరించేవాడు. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కు రూడీ సన్నిహితుడు.

నెల్సన్ మండేలా బే ఏరియాలో నివసించే రూడీ కోర్జెన్ గోల్ఫ్ టోర్నీలో పాల్గొనేందుకు కేప్ టౌన్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రివర్స్ డేల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై రూడీ కోర్జెన్ తనయుడు జూనియర్ కోర్జెన్ స్పందిస్తూ, తన తండ్రి వాస్తవానికి సోమవారమే తిరిగి రావాల్సి ఉందని, బహుశా వారు మరో రౌండ్ ఆడేందుకు అక్కడే ఆగి ఇవాళ బయల్దేరి ఉంటారని అభిప్రాయపడ్డాడు. 

రూడీ కోర్జెన్ 1992 నుంచి 2010 వరకు అంపైర్ గా విధులు నిర్వర్తించాడు. 108 టెస్టులు, 209 వన్డేలు, 14 టీ20 అంతర్జాతీయ పోటీల్లో రూడీ అంపైరింగ్ చేశాడు. 

కాగా, రూడీ కోర్జెన్ మృతి పట్ల వీరేంద్ర సెహ్వాగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అతడి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నానని సెహ్వాగ్ వెల్లడించాడు. రూడీతో తనకు ఎంతో గొప్ప అనుబంధం ఉందని తెలిపాడు. తాను బ్యాటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా అడ్డదిడ్డంగా ఆడితే, కాస్త బుర్రపెట్టి ఆడు అంటూ సూచన చేసేవాడని, నీ బ్యాటింగ్ చూడాలనుకుంటున్నాను అని చెప్పేవాడని సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు. 

ఓసారి రూడీ తన కుమారుడికి ఓ కంపెనీ క్రికెట్ ప్యాడ్లు కొనాలని భావించి తనను సంప్రదించాడని, వెంటనే ఆ కంపెనీ ప్యాడ్లను బహూకరిస్తే ఎంతో సంబరపడిపోయాడని తెలిపాడు. చాలా మంచి వ్యక్తి అని, రూడీని మిస్సవుతున్నానని సెహ్వాగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.
.
Rudi Koertzen
Demise
Road Accident
South Africa
Umpire
Cricket
Virender Sehwag

More Telugu News