Vijayasai Reddy: భారత్-పాకిస్థాన్ బోర్డర్లో విజయసాయిరెడ్డి... ఫొటోలు ఇవిగో!
- పంజాబ్ లో పర్యటించిన విజయసాయి
- అమృత్ సర్ స్వర్ణ దేవాలయం సందర్శన
- జలియన్ వాలా భాగ్ లో అమరవీరులకు నివాళి
- వాఘా-అట్టారీ బోర్డర్ కు వెళ్లిన వైనం
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పంజాబ్ లో పర్యటించారు. ఆయన అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. ఇక్కడ గురుగ్రంథ్ సాహిబ్ భక్తి గీతాలు వింటుంటే మనసుకు ప్రశాంతంగా అనిపించిందని అన్నారు. అమృత్ సర్ లో దేశవిభజన మ్యూజియంను కూడా సందర్శించిన విజయసాయి, దేశవిభజన నాటి గాథలు విని చలించిపోయానని పేర్కొన్నారు.
నాడు స్వాతంత్ర్యోద్యమ ఘట్టంలో విషాద పరిణామాలకు వేదికగా నిలిచిన జలియన్ వాలా భాగ్ కు కూడా వెళ్లారు. దాస్య శృంఖలాల నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించినట్టు విజయసాయి ట్విట్టర్ లో వెల్లడించారు.
అటుపై, వాఘా-అట్టారీ ప్రాంతంలో భారత్-పాకిస్థాన్ బోర్డర్ వద్దకు వెళ్లారు. అక్కడ నిత్యం జరిగే సైనిక దళాల కవాతును వీక్షించారు. అక్కడ వందేమాతరం, హిందూస్థాన్ జిందాబాద్ అనే నినాదాలతో మార్మోగిపోయిందని ఆయన వెల్లడించారు. దేశ రక్షణలో ముందు వరుసలో నిలిచే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) పట్ల గర్విస్తున్నానని విజయసాయి తెలిపారు.