Sharmila: రేవంత్ రెడ్డి, కేటీఆర్ లపై షర్మిల విమర్శలు
- కొడంగల్ లో షర్మిల పర్యటన
- కొడంగల్ ప్రజలు తెలివైన వాళ్లని వ్యాఖ్య
- కొడంగల్ లో గెలవని వ్యక్తి, రాష్ట్రంలో పార్టీని గెలిపిస్తారా? అంటూ రేవంత్ పై విమర్శలు
- చిన్నదొర కాలికి దెబ్బ తగిలితే మెదడు పనిచేయడంలేదంటూ వ్యంగ్యం
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వికారాబాద్ జిల్లా కొడంగల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె రేవంత్ రెడ్డి, కేటీఆర్ లపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డిని కొడంగల్ ప్రజలు ఓడించి ముఖం చెల్లకుండా చేశారని వ్యాఖ్యానించారు. అలాంటి ముఖం చెల్లని వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి రాష్ట్ర అధ్యక్షుడ్ని చేసిందని విమర్శించారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారని, కొడంగల్ లో గెలవని వ్యక్తి, రాష్ట్రంలో పార్టీని గెలిపిస్తారా? అని ప్రశ్నించారు.
కొడంగల్ ను ఒక దొంగ నుంచి కాపాడుకుంటే మరో దొంగ చేతిలోకి పోయిందని షర్మిల అన్నారు. ఇప్పుడున్న దొంగ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అన్నారు. అక్రమాలు, లాండ్ సెటిల్ మెంట్లు చేసి డబ్బులు సంపాదించుకోవడం తప్ప, ప్రజలకు చేసిందేమీలేదని ఆరోపించారు. సిద్ధిపేట హరీశ్ రావు వచ్చి బంగారు కొడంగల్ చేస్తామని అన్నారు. అయిందా బంగారు కొడంగల్? పక్కనే కోస్గీకి బస్ డిపో ఇస్తామన్నారు... ఇచ్చారా? అని ప్రశ్నించారు.
"ఇక కేటీఆర్ గారు... చిన్నదొర... ఏంచెప్పాడు? ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కొడంగల్ ను దత్తత తీసుకుంటా, మరో సిరిసిల్లలాగా తయారు చేస్తా అన్నాడు. మరి దత్తత తీసుకున్నాడా, ఒక్క అభివృద్ధి పనైనా చేశాడా? చిన్నదొర కాలికి దెబ్బ తగిలితే మెదడు పనిచేయడంలేదు... ఒక్కమాట కూడా గుర్తుండడంలేదు... అదీ ఈ రోజు కొడంగల్ పరిస్థితి" అంటూ ప్రసంగించారు.