Urvashi Rautela: ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలున్న ఈజిప్ట్ సింగర్ నాకు ప్రపోజ్ చేశాడు: నటి ఊర్వశి రౌతేలా
- సాంస్కృతిక వ్యత్యాసం కారణంగా అంగీకరించలేదన్న ఊర్వశి
- ఆ సింగర్ మహ్మద్ రమదాన్ అయి ఉంటాడంటున్న అభిమానులు
- గతేడాది అతడితో కలిసి మ్యూజిక్ ఆల్బమ్
- అత్యంత ఖరీదైన మ్యూజిక్ వీడియోగా రికార్డు
- ఊర్వశి క్యాస్టూమ్స్‌కే రూ. 15 కోట్ల ఖర్చు
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ‘బాలీవుడ్ హంగామా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి ప్రపోజల్స్‌పై మాట్లాడుతూ.. ఓసారి తనకు ఓ ఈజిప్ట్ సింగర్ నుంచి పెళ్లి ప్రతిపాదన వచ్చిందని గుర్తు చేసుకుంది. అయితే, ఆ ప్రపోజల్‌ను తాను అంగీకరించలేదని పేర్కొంది. ఇద్దరి సంస్కృతుల మధ్య వ్యత్యాసం కారణంగానే తాను ‘నో’ చెప్పానంది.
అంతేకాకుండా అతడికి అప్పటికే ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారని తెలిపింది. దుబాయ్‌లో కలిసినప్పుడు అతడి నుంచి తనకు ఈ ప్రపోజల్ వచ్చిందని వివరించింది. అదొక్కటే కాదు, తనకు చాలా పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపింది. తనకు ప్రపోజ్ చేసిన ఈజిప్ట్ సింగర్ పేరు వెల్లడించనప్పటికీ అతడు ‘మహ్మద్ రమదాన్’ అయి ఉండొచ్చని అభిమానులు చెబుతున్నారు.
అభిమానులు మహ్మద్ రమదాన్ పేరు చెప్పడం వెనక ఓ కారణం కూడా ఉంది. ఊర్వశి అతడితో కలిసి ‘వెర్సేస్ బేబీ’ అనే మ్యూజిక్ వీడియోతో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. 2021లో విడుదలైన ఈ వీడియోలో ఊర్వశిని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ డోనాటెల్లా వెర్సాస్ తీర్చిదిద్దారు. ఈ వీడియో గతేడాది అత్యంత ఖరీదైన మ్యూజిక్ వీడియోలలో ఒకటిగా రికార్డులకెక్కింది. అందులో ఊర్వశి క్యాస్టూమ్స్‌కే రూ. 15 కోట్లు ఖర్చయింది. రొమాంటిక్ కామెడీ సినిమా ‘సింగ్ సాబ్ ది గ్రేట్’తో 2013లో ఊర్వశి సినీరంగ ప్రవేశం చేసింది. ఇందులో సన్నీడియోల్, అమృతరావ్ నటించారు.