Mud bath: రోడ్డుపై పెద్ద గోతులు.. వర్షపు నీరు.. కేరళ వ్యక్తి వినూత్న నిరసన

Mud bath Yoga in potholes Kerala mans unique protest against poor roads

  • భారీ వర్షాల కారణంగా కేరళలో దెబ్బతిన్న రోడ్లు
  • రహదారిపై నిలిచిన వర్షపు నీరు
  • అందులోనే స్నానం చేసి, యోగాసనాలు వేసిన వ్యక్తి

రహదారులు చెరువులా మారితే..? రాకపోకలకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. భారీ వర్షాల కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఓ వ్యక్తి వినూత్న నిరసనకు దిగాడు. మలప్పురం ప్రాంతంలో రహదారులపై భారీగా ఏర్పడిన గోతుల్లో నీరు చేరింది. దీంతో హంజా పొరాలి అనే వ్యక్తి అదే నీటిలో యోగాసనాలు వేశాడు. అదే నీటితో స్నానం చేసి స్థానిక ఎమ్మెల్యేకు పరిస్థితి అర్థమయ్యేలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో వైరల్ అవుతోంది.

తన వస్త్రాలను రహదారిపై నిలిచిన మురికి నీటితోనే ఉతుక్కున్నాడు పొరాలి. స్థానిక ఎమ్మెల్యే లతీఫ్ అక్కడకు చేరుకుని కారు నుంచి కిందకు దిగారు. ఎమ్మెల్యేను చూసిన హంజా పొరాలి నీటిలో ఒంటి కాలిపై నించుని యోగాసనం వేశాడు. ఇటీవలి వర్షాలకు కేరళలో రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఎర్నాకులం జిల్లా నెడుంబస్రేలో జాతీయ రహదారిపై గోతి కారణంగా 52 ఏళ్ల వ్యక్తి మరణించడంపై అక్కడి హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. అన్ని రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలని కూడా ఆదేశించింది.

  • Loading...

More Telugu News