TDP: టీడీపీకి మంగళగిరి కీలక నేత గంజి చిరంజీవి రాజీనామా... సొంత పార్టీ నేతలే అన్యాయం చేశారంటూ ఆరోపణ!
- 2014లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చిరంజీవి
- 2019లో నారా లోకేశ్ పోటీ చేయడంతో చిరంజీవికి దక్కని అవకాశం
- చివరి నిమిషంలో తనకు అన్యాయం చేశారన్న చిరంజీవి
- బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసే వారితోనే తన ప్రయాణమని ప్రకటన
టీడీపీకి బుధవారం ఓ కీలక నేత రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా పరిధిలోని మంగళగిరికి చెందిన బీసీ నేత, 2014 ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంజి చిరంజీవి పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా, సొంత పార్టీ నేతలే తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం తాను కొనసాగుతున్న టీడీపీ అధికార ప్రతినిధి పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు.
టీడీపీలో బీసీ నేతగా కొనసాగుతున్న తనను సొంత పార్టీ నేతలే రాజకీయంగా ఇబ్బంది పెట్టారని ఈ సందర్భంగా చిరంజీవి ఆరోపించారు. 2014 ఎన్నికల్లో మంగళగిరిలో తన ఓటమికి టీడీపీ నేతలే కారణమని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేకే టీడీపీకి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. టీడీపీ నేతలే తన రాజకీయ జీవితాన్ని నాశనం చేశారన్న చిరంజీవి... 2019 ఎన్నికల్లో చివరి నిమిషం దాకా మంగళగిరి సీటు తనదేనని చెప్పిన నేతలు ఆఖరి క్షణంలో మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసే పార్టీతోనే తన ప్రయాణం అని చిరంజీవి అన్నారు. తన అనుచరులను సంప్రదించి త్వరలోనే తన భవిష్యత్తు రాజకీయ వ్యూహాన్ని ప్రకటిస్తానని ఆయన చెప్పారు. 2014లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చిరంజీవి... 2019లోనూ అక్కడి నుంచే పోటీ చేయాలని భావించారు. అయితే పార్టీ అగ్రనేత నారా లోకేశ్ అక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో చిరంజీవికి అవకాశం దక్కలేదు. తాజాగా 2024లోనూ మంగళగిరి నుంచే పోటీ చేయాలని లోకేశ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో మరోమారు తనకు అవకాశం దక్కదన్న భావనతోనే టీడీపీకి చిరంజీవి రాజీనామా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.