Direct Link: భారత్, చైనా వాయుసేనల మధ్య ఇక డైరెక్ట్ లింకు

Direct link between India and China air forces
  • గతవారం భారత్, చైనా సైనిక చర్చలు
  • సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణపై ప్రతిపాదనలు
  • ప్రత్యేక హాట్ లైన్ ఏర్పాటు
  • నేరుగా ఒకరినొకరు సంప్రదించుకునే వెసులుబాటు
భారత్, చైనా సరిహద్దుల్లో ఎల్ఏసీ పొడవునా గతకొంతకాలంగా సైనిక కార్యకలాపాలు పెరిగాయి. పలు సందర్భాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో, భారత్, చైనా వాయుసేనలు ఉద్రిక్తతల నివారణ దిశగా కీలక చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. అందులో భాగంగా, ఇరు దేశాల వాయుసేనల మధ్య ఇక నేరుగా సమాచార వినిమయ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

సరిహద్దుల వెంబడి యుద్ధ విమానాలు, డ్రోన్లు వంటివి గీత దాటిన పక్షంలో నేరుగా ఆ దేశ వాయుసేనతో మాట్లాడి తక్షణమే ఆ సమాచారాన్ని వారితో పంచుకునేందుకు ఈ డైరెక్ట్ లింకు తోడ్పడుతుంది. గతంలో ఇలాంటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలంటే ఇతర మార్గాల ద్వారా సంప్రదింపులు జరపాల్సి వచ్చేది. అందుకు ఎంతో సమయం పట్టేది. ఇప్పుడు భారత్, చైనా వాయుసేనలు నేరుగా ఒకరినొకరు సంప్రదించుకునేందుకు వీలు కలుగుతుంది. ఇందుకోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), పీపుల్స్ లిబరేషర్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (పీఎల్ఏఏఎఫ్) మధ్య ప్రత్యేక హాట్ లైన్ ఏర్పాటు చేయనున్నారు. 

ఇప్పటికే లడఖ్ ప్రాంతంలో ఇరు దేశాల సైన్యాల మధ్య ఇలాంటి డైరెక్ట్ లింకు ఏర్పాటు ఉంది. దీన్ని ఉపయోగించుకుని వాయుసేనల మధ్య తాజా హాట్ లైన్ వ్యవస్థను నెలకొల్పనున్నారు. గతవారం ఇరుదేశాల సైన్యాల మధ్య చుషుల్-మోల్డో సరిహద్దు సమావేశం జరిగిన సందర్భంగా ఈ అంశంపై చర్చించారు. ఇటీవల చైనా యుద్ధ విమానాలు సరిహద్దుల్లోకి చొచ్చుకురావడాన్ని భారత్ ఈ సమావేశంలో ఎత్తిచూపింది.
Direct Link
India
China
Airforce
Hotline
Border
IAF
PLAAF

More Telugu News