Death Valley: ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రదేశంలో వరదలు... వీడియో ఇదిగో!
- కాలిఫోర్నియాలో డెత్ వ్యాలీ
- పేరుకు తగ్గట్టే మృత్యులోయ
- డెత్ వ్యాలీలో వర్షబీభత్సం
- వరదల్లో చిక్కుకున్న 1000 మంది
అమెరికాలోని కాలిఫోర్నియాలో డెత్ వ్యాలీ అనే ప్రదేశం ఉంది. ఇది పేరుకు తగ్గట్టే మృత్యు లోయ. ఇక్కడ అడుగుపెట్టిన వారెవరూ ప్రాణాలతో బయటపడడం కష్టం. కనీసం తాగడానికి నీరు కూడా దొరకదు. నీడనిచ్చేందుకు ఒక్క చెట్టూ కనిపించదు. ఎటు చూసినా కొండలు, గుట్టలు, పొదలు, ఇసుక నేలలతో కూడి ఓ ఎడారిలా కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత అధిక ఉష్ణోగ్రత నమోదయ్యేది ఇక్కడే.
ఇలాంటి ప్రదేశంలో ఒక్క చినుకు పడినా అది గొప్ప విషయమే. అలాంటిది వరదలు వచ్చాయంటే నమ్మగలరా? అది కూడా వెయ్యేళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి వర్షం కురుస్తుందన్న రీతిలో వర్షపాతం నమోదైంది. దాంతో ఆ మృత్యులోయలో ఏకంగా వరదలు సంభవించాయి.
కాగా, ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అమెరికా ప్రభుత్వం పర్యాటకులను అనుమతిస్తోంది. ఆ విధంగా పర్యటనకు వచ్చిన 500 మందికి పైగా టూరిస్టులు, 500 మంది సిబ్బంది ఈ వరదల ధాటికి అక్కడే చిక్కుకుపోయారు. రెండు డజన్లు వాహనాలు బురదలో కూరుకుపోయాయి. ఆరు గంటల నరకం అనంతరం వారందరూ సురక్షితంగా బయటపడగలిగారు. గత రెండు వారాల వ్యవధిలో ఇలాంటి కుండపోత వర్షం పడడం ఇది నాలుగో సారి.