Eatala Rajendar: నేను సీఎం అభ్యర్థినంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదు: ఈటల
- పత్రికలు, సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దన్న ఈటల
- ఎవరైనా పార్టీ నియమావళికి లోబడి పనిచేయాలని వ్యాఖ్య
- ఏ పదవి అయినా పార్టీయే నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
బీజేపీలో నేతల సామర్థ్యాన్ని గుర్తించి నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీజేపీ క్రమశిక్షణకు పెద్దపీట వేసే పార్టీ అని, నాయకులైనా, కార్యకర్తలైన పార్టీ నియమావళికి లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇటీవల తాను సీఎం అభ్యర్థినంటూ కొన్ని కథనాలు వస్తున్నాయని, వాటిలో నిజంలేదని ఈటల స్పష్టం చేశారు. ఏ పదవి అయినా పార్టీ నిర్ణయించాల్సిందేనని ఉద్ఘాటించారు. వ్యక్తులు చేయాల్సిందల్లా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడమేనని ఆయన వివరించారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని పేర్కొన్నారు.
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘనవిజయాల తర్వాత బీజేపీ తెలంగాణలో అధికారంపై కన్నేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆశాజనక ఫలితాలు రావడంతో కమలనాథుల్లో ఉత్సాహం నెలకొంది. కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనేలా బండి సంజయ్ పోరాటం సాగిస్తుండడం చూస్తుంటే బీజేపీ లక్ష్యం తెలంగాణలో అధికారమే అని స్పష్టమవుతోంది.