CM Jagan: 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల కోసం టెండర్లు ఖరారు చేయండి: సీఎం జగన్ ఆదేశం

CM Jagan directs to procure tabs for 8th class students
  • విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష
  • హాజరైన విద్యాశాఖ మంత్రి బొత్స, అధికారులు
  • అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలన్న సీఎం జగన్
  • దశలవారీగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని స్పష్టీకరణ
రాష్ట్ర విద్యాశాఖపై ఏపీ సీఎం జగన్ ఇవాళ సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ట్యాబ్ ల సేకరణ కోసం వెంటనే టెండర్లు ఖరారు చేయాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించారు. 

ప్రతి పాఠశాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలని, ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం టీవీ ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. దశల వారీగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక, వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్ చివరి నాటికల్లా సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలకు ఎలాంటి మరమ్మతులు వచ్చినా, వెంటనే బాగు చేసే విధానం తీసుకురావాలని నిర్దేశించారు.
CM Jagan
Review
Education
Tabs
Students

More Telugu News