RBI: ఉదయం ఎనిమిదికి ముందు.. రాత్రి ఏడు తర్వాత కాల్స్​ చేయొద్దు: లోన్​ రికవరీ ఏజెంట్లకు రిజర్వు బ్యాంకు ఆదేశాలు

RBI directs loan recovery agents no calling before 8 am and after 7 pm
  • రుణ గ్రహీతలకు వేధింపులు పెరిగిపోయిన నేపథ్యంలో రిజర్వు బ్యాంకు నిర్ణయం
  • ఎలాంటి మానసిక, శారీరక వేధింపులకు పాల్పడవద్దని ఆదేశం
  • తప్పుడు సమాచారం, బెదిరింపులతో కూడిన మెసేజీలు చేయవద్దని స్పష్టీకరణ
రుణాలు తీసుకుని వాయిదాలు సరిగా కట్టలేని వారిపై లోన్ రికవరీ ఏజెంట్లు వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు పలు ఉపశమన చర్యలను ప్రకటించింది. రుణ రికవరీ ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం ఎనిమిది గంటలకు ముందు, రాత్రి ఏడు గంటల తర్వాత రుణ గ్రహీతలకు ఫోన్లు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీలు, ఇతర రుణ సంస్థలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

‘‘రుణాలు ఇచ్చే సంస్థలు వారి ఉద్యోగులు గానీ, వారి ఏజెంట్లు గానీ రుణ గ్రహీతలపై ఎలాంటి మానసిక, శారీరక వేధింపులకు పాల్పడకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలి. రుణాలను తిరిగి వసూలు చేసుకోవడానికి వేధింపులకు పాల్పడటం చేయవద్దు” అని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. 

రుణ గ్రహీతలకు ఎలాంటి తప్పుడు సమాచారం, బెదిరింపులతో కూడిన మెసేజీలు చేయడానికి వీలు లేదని హెచ్చరించింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, కో ఆపరేటివ్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్ బీ ఎఫ్ సీ), అసెట్ రీకన్ స్ట్రక్షన్ కంపెనీలు సహా దేశంలోని అన్ని ఆర్థిక, రుణ సంస్థలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. 

ఇటీవల రుణ గ్రహీతలపై లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు శ్రుతి మించుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సూచనలు చేస్తున్నామని.. ఇప్పటికే ఉన్న నిబంధనలు, మార్గదర్శకాలకు ఇవి అదనమని పేర్కొంది.
RBI
Reserve Bank
Loan
Loan recovery Agents
India
Banks
NBFCs

More Telugu News