Electric Bikes: ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు దగ్ధం అవుతున్నాయో గుర్తించిన నిపుణుల కమిటీ
- ఇటీవల ఎలక్ట్రిక్ బైకుల్లో అగ్ని ప్రమాదాలు
- చార్జింగ్ పెడుతుండగా మంటలు
- ప్రాణాలు కోల్పోయిన పలువురు వ్యక్తులు
- నివేదిక రూపొందించిన నిపుణుల కమిటీ
ఇటీవల కాలంలో దేశంలో పలు ఎలక్ట్రిక్ బైకులు అగ్నికి ఆహుతి కావడం తెలిసిందే. చార్జింగ్ పెడుతున్న సమయంలోనూ, ప్రయాణిస్తున్న సమయంలోనూ ఎలక్ట్రిక్ బైకులు దగ్ధమైన ఘటనలు ఈ వేసవిలో చోటుచేసుకున్నాయి. పలువురు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అని భావిస్తున్న తరుణంలో ఇలాంటి ప్రమాదాలు జరగడంపై కేంద్రం దృష్టిసారించింది. ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు కాలిపోతున్నాయో తెలుసుకునేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
తాజాగా నిపుణుల కమిటీ అధ్యయనం జరిపి ఓ నివేదిక రూపొందించింది. చాలా ప్రమాదాలు బ్యాటరీలో లోపాలు, షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగాయని కమిటీ గుర్తించింది. సెల్ఫ్ వెంటింగ్ మెకానిజంలో తీవ్రస్థాయి లోపాలు ఉన్న విషయాన్ని గమనించింది. అంతేకాదు, నాణ్యత లేని వాహనాలు విక్రయించాయంటూ మూడు కంపెనీలపై భారీ జరిమానా విధించాలని ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.