Salman: యూపీలో పాకిస్థాన్ జెండా ఎగురవేసిన యువకుడి అరెస్ట్
- భారత్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
- హర్ ఘర్ తిరంగా పిలుపునిచ్చిన ప్రధాని మోదీ
- ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలని ఆకాంక్ష
- ఖుషీనగర్ లో పాకిస్థాన్ జెండా ఎగురవేసిన సల్మాన్ అనే వ్యక్తి
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జాతీయ పతాకం ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. హర్ ఘర్ తిరంగా పేరిట ప్రతి ఇంట్లోనూ దేశభక్తి వెల్లివిరియాలంటూ ఆకాంక్షించారు. అయితే, ఉత్తరప్రదేశ్ లో సల్మాన్ (21) అనే యువకుడు తన ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగురవేశాడు. ఖుషీనగర్ ప్రాంతంలోని వేదుపార్ ముస్తాక్విల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఆ వ్యక్తి ఇంటి మీద పాకిస్థాన్ జెండా ఎగురుతుండడం గమనించిన స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సల్మాన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ పాకిస్థాన్ జెండాను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతడితో పాటు జెండాను రూపొందించిన అతడి బంధువు షెహనాజ్, పతాకావిష్కరణలో సాయపడిన ఇమ్రాన్ అనే మైనర్ బాలుడిపైనా కేసు నమోదు చేశారు.