Rajasthan: కుండలో నీళ్లు తాగిన దళిత బాలుడు.. కొట్టి చంపిన ఉపాధ్యాయుడు
- జాలోర్ జిల్లాలోని సురానా గ్రామంలో ఘటన
- ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న బాలుడు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాలుడు
- విషాదకరమన్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్
- విచారణ కోసం కమిటీ ఏర్పాటు
- నిందితుడైన ఉపాధ్యాయుడి అరెస్ట్
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఒకటి రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలో జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న 9 ఏళ్ల దళిత బాలుడు కుండలో నీళ్లు తాగాడని ఉపాధ్యాయుడు చితక్కొట్టాడు. దెబ్బలకు తాళలేని బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని సురానా గ్రామంలో జులై 20న బాలుడిపై దాడి జరిగింది. అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు నిన్న ప్రాణాలు విడిచాడు.
నిందితుడైన చైల్ సింగ్ (40)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నియంత్రణ) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇది చాలా విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడైన ఉపాధ్యాయుడిపై అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైనట్టు తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాజస్థాన్ విద్యాశాఖ విచారణ కోసం ఓ కమిటీని నియమించింది. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఖిలాడీ లాల్ బైర్వా రేపు (ఆగస్టు 15) సురానా గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.