qualifications: అంగన్ వాడీ ఉద్యోగానికి ఇంటర్ పాస్ కావాల్సిందే
- ఇప్పటి వరకు పదో తరగతి అర్హతపై నియామకాలు
- విద్యార్హతలను పెంచిన కేంద్ర సర్కారు
- టీచర్ నియామకాల్లో సగం ఐదేళ్ల సర్వీసు ఉన్న ఆయాలకు కేటాయింపు
అంగన్ వాడీ ఉద్యోగుల అర్హతలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు పదో తరగతి విద్యార్హత ఆధారంగా అంగన్ వాడీ టీచర్, వర్కర్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. ఇకమీదట ఇంటర్ విద్యార్థత తప్పనిసరిగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇక అంగన్ వాడీ ఉద్యోగాల్లో చేరేందుకు అర్హత వయసును కూడా 18 ఏళ్లకు తగ్గించింది. ఇప్పటి వరకు కనీసం 21 ఏళ్లు ఉండాలన్న నిబంధన ఉంది. అలాగే, 35 ఏళ్ల వయసు వరకు గరిష్ట వయోపరిమితి అర్హతగా ఉంటుంది.
ఇక అంగన్ వాడీ ఉద్యోగాల్లోని వారికి రిటైర్మెంట్ వయసును నిర్ణయించలేదు. దీనిపై రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 65 ఏళ్లకు మించకుండా చూడాలని కోరింది. పార్ట్ టైమ్ ఉద్యోగులుగా వీరిని పేర్కొంది. అంగన్ వాడీ టీచర్ల నియామకాల్లో సగం ఉద్యోగాలను ఐదేళ్లపాటు పనిచేసిన ఆయాలతో భర్తీ చేయాలి. అలాగే, అంగన్ వాడీ సూపర్ వైజర్ పోస్టుల్లో 50 శాతాన్ని ఐదేళ్ల అనుభవం ఉన్న టీచర్ తో భర్తీ చేయాలి.