India: పరాయి పాలన నుంచి ‘ఆజాదీ’యే ఈ అమృతోత్సవాలు.. ఈ స్వాతంత్ర్య వేడుకలు ఎంతో ప్రత్యేకం!
- 75 ఏళ్ల స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలకు 75 వారాల ముందే అంకురార్పణ చేసిన ప్రధాని మోదీ
- స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమర యోధులను గుర్తు చేసుకుందాం
- ఇప్పటికే స్వాతంత్ర్య సంబురాల్లో మునిగిన ప్రజలు
పరాయి పాలన నుంచి విముక్తి లభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత దేశం అమృతోత్సవాలను జరుపుకుంటోంది. అదే ‘ఆజాదీ కా అమృతోత్సవ్’. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను.. ఘనంగా జరుపుకోవడానికి 75 వారాల ముందే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంకురార్పణ చేశారు. స్వాతంత్ర్యానికి బాటలు వేసిన గాంధీ మహాత్ముడి స్ఫూర్తితో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న సబర్మతి ఆశ్రమం నుంచి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను ప్రారంభించారు. నాటి నుంచి మొదలైన కార్యక్రమాలు.. ఈ ఆగస్టు 15 (సోమవారం) నాటికి ఉచ్ఛదశకు చేరనున్నాయి.
ఇది స్వాతంత్ర్యం ఇచ్చిన అమృతం
మనకు లభించిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సంబరంగా వేడుక చేసుకుంటూనే.. మనం ఈ రోజు ఇలా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకునే ప్రత్యేకమైన రోజు ఇది. ఆజాదీ అంటే స్వేచ్ఛ.. అమృతం అంటే అజరామరం.. మహోత్సవం అంటే అతి పెద్ద సంబరం.. అంటే ఈ స్వాతంత్ర్య దినోత్సవం. అజరామరమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సంబరం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఏడాదిన్నర కింద ఇదే చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే స్వాతంత్య్రాన్ని అందించే శక్తి తాలూకు అమృతం. నాటి స్వాతంత్య్ర పోరాట యోధుల ప్రేరణ తాలూకు అమృతం. కొత్త కొత్త ఆలోచనల, ఆత్మ నిర్భరత తాలూకు మకరందం” అని నాడు ఆయన వివరించారు.
‘హర్ ఘర్ తిరంగా’ పిలుపుతో..
దేశ స్వాతంత్ర్య సంబరాలను ఘనంగా జరుపుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయి. ముఖ్యంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం లక్ష్యంగా చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపు జన ఉత్సవాన్ని తలపించింది. మూడు రోజులుగా ఎక్కడ చూసినా, ఎటు చూసినా.. త్రివర్ణాలు కనువిందు చేస్తున్నాయి. ప్రతి పౌరుడూ ‘భారత్ మాతా కీ జై’ అని గుండెల నిండా నినదిస్తున్నాడు.
- దేశంలో ప్రతి పౌరుడూ జనగనమణ పాడాలని మహోత్సవ్ లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా జాతీయ గీతాన్ని పాడి అప్ లోడ్ చేసేందుకు వెబ్ సైట్ ఏర్పాటు చేశారు. అందులో ఇప్పటివరకు 50 లక్షల మందికిపైగా జాతీయ గీతాన్ని పాడి అప్ లోడ్ చేశారు.
- ఇలా రికార్డు చేసిన జాతీయ గీతాలను ఆగస్టు 15న ఎర్రకోట సహా పలు ప్రాంతాల్లో ఒకేసారి ప్లే చేయనున్నారు.
- అమృతోత్సవాల్లో భాగంగా గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థాయిల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
- ముఖ్యంగా విద్యార్థులకు దేశ స్వాతంత్ర్యం విలువ, నాటి పోరాటాల గొప్పతనాన్ని వివరించి.. దేశ భక్తి పురికొల్పేలా కార్యక్రమాలు నిర్వహించారు.
- దాదాపు అన్ని ప్రైవేటు, వాణిజ్య, వ్యాపార సంస్థలు కూడా ఈసారి స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం అయ్యాయి.
- త్రివర్ణ పతకాలు, విద్యుద్దీపాలతో అలంకరించాయి. ఉద్యోగుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలూ నిర్వహించాయి.