Prisoners: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- రాష్ట్రవ్యాప్తంగా 175 మంది ఖైదీలకు విముక్తి
- వారిలో 48 మంది జీవితఖైదు పడినవారు
- రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 66 మంది ఖైదీల విడుదల
- చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపశమనం రద్దు చేస్తామన్న అధికారులు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి మొత్తం 175 మంది ఖైదీలను విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ముందే విడుదలైన వారిలో జీవితఖైదు పడిన 48 మంది ఖైదీలు కూడా ఉన్నారు.
కాగా, సత్ప్రవర్తన కారణంగా విడుదలైన ఖైదీల్లో అత్యధికులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చెందినవారే. రాజమండ్రి జైలు నుంచి 66 మంది విడుదల కాగా, వారిలో 55 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి 40 మంది విడుదలయ్యారు. వారిలో 33 మంది జీవితఖైదు పడినవారే.
ఇక, నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి 25 మంది ఖైదీలు ప్రభుత్వ నిర్ణయంతో విముక్తి పొందారు. కాగా, జైల్లో కనబర్చిన సత్ప్రవర్తననే బయట కూడా కనబర్చాలని, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఉపశమనాన్ని రద్దు చేస్తామని ఖైదీలకు అధికారులు స్పష్టం చేశారు.