OLA: ఓలా నుంచి విద్యుత్ కారు.. ప్రకటించిన సీఈవో భవీశ్
- ఒక్కసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల ప్రయాణం
- నాలుగు సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగం
- 2024లో అందుబాటులోకి తెస్తామన్న ఓలా
- ‘ఓలా ఎస్1’ పేరుతో మరో స్కూటర్‌ను తీసుకొచ్చిన ఓలా
పంద్రాగస్టున ఓ కీలక ప్రకటన చేయబోతున్నట్టు ప్రకటించిన ఓలా అనుకున్నట్టుగా ఓ ప్రకటన చేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించే విద్యుత్ కారును తీసుకొస్తున్నామని, 2024లో దీనిని అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. కేవలం నాలుగు సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా ఈ కారును తీర్చదిద్దనున్నట్టు పేర్కొన్నారు.
పెట్రోలు, డీజిల్ రేట్లు సామాన్యులు మోయలేనంతగా పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో ఎలక్ట్రిక్ వాహనలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లతో అనూహ్యంగా ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించిన ఓలా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి సారించింది. ఆగస్టు 15న కీలక ప్రకటన చేయబోతున్నట్టు కంపెనీ టీజర్ విడుదల చేసినప్పుడే.. అది ఎలక్ట్రిక్ కారు అయి ఉంటుందని అందరూ అంచనా వేశారు. ఊహించినట్టుగానే ఓలా ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.
తమిళనాడులోని పోచంపల్లిలో వంద ఎకరాల్లో లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్, 200 ఎకరాల్లో ఈవీ కారు ప్లాంట్, 40 ఎకరాల్లో ఈవీ స్కూటర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు భవీశ్ తెలిపారు. ఏడాదికి 10 లక్షల విద్యుత్ కార్లు, కోటి ఈవీ బైక్‌లు,100 గిగావాట్ బ్యాటరీ సెల్స్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. అలాగే, నిన్న ‘ఓలా ఎస్1’ పేరిట కొత్త స్కూటర్‌ను కంపెనీ ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 99,999 మాత్రమే. రూ.499 చెల్లించి ముందస్తుగా స్కూటర్‌ను రిజర్వు చేసుకోవచ్చని పేర్కొంది.