Google: పని చేయకుంటే పంపేస్తామన్న గూగుల్.. 100 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిన యాపిల్!
- వ్యయాలు తగ్గించుకునే ఉద్దేశంతో ఉద్యోగుల తొలగింపుపై కంపెనీల దృష్టి
- ఇటీవలే ఉద్యోగులను తొలగించిన పలు ఐటీ, టెక్ సంస్థలు
- ప్రముఖ సంస్థల్లోనూ దాదాపు ఏడాదిగా జాడలేని నియామకాలు
వ్యయాలను తగ్గించుకునే క్రమంలో కొంత కాలం నుంచి పెద్ద పెద్ద టెక్, ఐటీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపుపై దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగానే పనితీరు బాగోలేని ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో గూగుల్ సంస్థ పనితీరు సరిగాలేకుంటే ఇంటికి పంపేస్తామని తాజాగా ఉద్యోగులను హెచ్చరించింది. మరోవైపు యాపిల్ సంస్థ ఉద్యోగులను రిక్రూట్ చేసే విభాగంలోని 100 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్ బుక్ యాజమాన్య సంస్థ మెటా కూడా ఉద్యోగాల భర్తీని నిలిపివేయగా.. తాజాగా ఉద్యోగుల తొలగింపుపైనా దృష్టి పెట్టినట్టు టెక్ వర్గాలు చెబుతున్నాయి.
గూగుల్ లో నిరాశాజనకంగా..
పనితీరు బాగోలేని, అంచనాలను అందుకోలేని ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని గూగుల్ సీనియర్ అధికారులు హెచ్చరించినట్టుగా ఇన్ సైడర్, న్యూయార్క్ పోస్టు పత్రికలు తాజాగా కథనాలు వెలువరించాయి. ఆ కథనాల ప్రకారం.. గూగుల్ క్లౌడ్ సేల్స్ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే పరిశీలన జరుగుతోంది. సాధారణ పనితీరుతోపాటు విక్రయాల్లో పురోగతి సరిగా లేని ఉద్యోగులపై చర్యలు తప్పవని సేల్స్ బృందాలకు ఆదేశాలు వచ్చాయి. అంతేకాదు గూగుల్ సంస్థ ఈ నెలలో ఎలాంటి నియామకాలు చేపట్టడం లేదు. అయితే వీటిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఆదాయం తగ్గడం.. వ్యయాలు పెరగడం..
ఇన్ సైడర్, న్యూయార్క్ పోస్ట్ కథనాల ప్రకారం.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ నెల మొదట్లో కొందరు ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గూగుల్‌లో ఉత్పాదకత తగిన విధంగా ఉండటం లేదని పేర్కొన్నారు. కొంతకాలం నుంచి గూగుల్ ఆదాయం ఆశించినంతగా ఉండకపోవడమే ఈ హెచ్చరికల వెనుక కారణమని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి.
యాపిల్ లో నియామకాలు చేసేవారే తొలగింపు..
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన యాపిల్ లోనూ ఉద్యోగాల కోత కలవరపెడుతోంది. యాపిల్ సంస్థలో రిక్రూట్ మెంట్లను నిర్వహించే 100 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని యాపిల్ తాజాగా తొలగించింది. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించింది. ఉద్యోగ నియామకాలను తగ్గించడం, అందుకు సంబంధించిన ఖర్చును నియంత్రించుకోవడంలో భాగంగా యాపిల్ ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది.
- అయితే ఫుల్ టైం రిక్రూట్ మెంట్ ఉద్యోగులను మాత్రం ఉద్యోగాల్లో కొనసాగించినట్టు వెల్లడించింది.
- ప్రస్తుత ఆర్థిక అవసరాలు, ఖర్చుల తగ్గింపు లక్ష్యంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు యాపిల్ వెల్లడించింది.
- తొలగింపు వెంటనే అమల్లోకి వచ్చినా.. వారికి రెండు వారాల పాటు వేతనాన్ని, మెడికల్ ప్రయోజనాలను వర్తింపజేయనున్నట్టు తెలిపింది.