CM KCR: మోదీని చూస్తే ఇక్కడి బీజేపీ నేతలకు భయం: వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్
- వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటన
- టీఆర్ఎస్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం
- కృష్ణా జలాలపై కేంద్రం నాన్చుతోందని విమర్శలు
- బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రాన్ని అడగాలన్న కేసీఆర్
బీజేపీ జెండాను చూసి మోసపోవద్దని, మోసపోతే బాధపడాల్సి వస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ వికారాబాద్ సభలో వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు.
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తేల్చమంటే కేంద్రం నాన్చుతోందని, తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిలిచిపోయిందని, కృష్ణా జలాల్లో నీటివాటా ఎంతో తేల్చాలని కేంద్రాన్ని అడగాలని డిమాండ్ చేశారు. కానీ తెలంగాణ బీజేపీ నేతలకు మోదీని చూస్తే భయం అని ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేసి నీళ్లు తెచ్చే బాధ్యత తనదని స్పష్టం చేశారు.
ఈ ఎనిమిదేళ్ల కాలంలో బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేయని మోదీ సర్కారు, ఉచిత పథకాలు రద్దు చేయాలంటోందని మండిపడ్డారు. బీజేపీ జెండాను చూసి మోసపోతే ఉచిత కరెంటు రాదని, మోటార్లకు మీటర్లు పెడతారని పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వని మోదీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మాత్రం రూ.20 లక్షల కోట్లు దోచిపెడుతోందని అన్నారు.