BCG Vaccine: టైప్-1 మధుమేహ రోగులకు బీసీజీ టీకాతో కరోనా నుంచి దీర్ఘకాల రక్షణ!
- టైప్-1 మధుమేహ రోగులపై జరిపిన పరిశోధనలో అద్భుత ఫలితాలు
- ఆలస్యంగా పనిచేసినా దీర్ఘకాల రక్షణ ఇస్తుందన్న పరిశోధకులు
- కరోనాతోపాటు ఇతర వైరస్‌లు, వేరియంట్లకు అడ్డుకట్ట
టైప్-1 మధుమేహ రోగుల్లో కరోనాకు అడ్డుకట్ట వేసే విషయంలో పరిశోధకులు మరో ముందడుగు వేశారు. క్షయ నివారణకు వాడే బీసీజీ టీకాతో టైప్-1 డయాబెటిస్ రోగుల్లో కొవిడ్ నుంచి దీర్ఘకాల రక్షణ లభిస్తుందని అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ ఆసపత్రి పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్ టీకాలు వైరస్ నివారణకే పరిమితం అవుతుండగా, బీసీజీ టీకాను పలు మోతాదుల్లో ఇవ్వడం ద్వారా కరోనాతోపాటు ఇతర వైరస్‌లు, అంటువ్యాధులకు చెక్ పడుతుందని తేలింది. 144 మంది టైప్-1 డయాబెటిస్ రోగులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
ఈ పరిశోధనలో కరోనాపై బీసీజీ టీకా 92 శాతం సామర్థ్యం చూపించింది. నిజానికి రోగ నిరోధకశక్తి చాలా తక్కువగా ఉండే టైప్-1 మధుమేహ రోగులకు కరోనా సోకితే అది ప్రాణాల మీదకు వస్తుంది. పరిశోధనలో పాల్గొన్న మధుమేహ రోగులకు కరోనా సోకడానికి ముందు బీసీజీ టీకాను మూడు డోసులు ఇవ్వగా, అవి వారికి కరోనా నుంచి రక్షణ కవచంగా నిలిచినట్టు మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి పరిశోధకుడు డెవిస్ ఫౌస్ట్‌మన్ తెలిపారు.
ఈ టీకా వల్ల ప్రతికూల ఫలితాలేమీ కనిపించలేదన్నారు. టీకా ఆలస్యంగా ప్రభావం చూపినా దీర్ఘకాలం రక్షణగా నిలుస్తుందన్నారు. అంతేకాదు, కొవిడ్ కొత్త వేరియంట్లపైనా ఇది ప్రభావం చూపిస్తుందని ఫౌస్ట్‌మన్ తెలిపారు. క్షయ రోగ నివారణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 కోట్ల మంది బాలలకు ఈ టీకా ఇస్తున్నారు.