Uttar Pradesh: షాహీ మసీదు ఈద్గాలో జన్మాష్టమి వేడుకలకు అనుమతినివ్వాలంటూ యూపీ సీఎంకు రక్తంతో లేఖ
- శ్రీకృష్ణుడు జన్మించిన స్థలం ఇదేనన్న అఖిల భారత హిందూ మహాసభ జాతీయ కోశాధికారి దినేశ్ శర్మ
- శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ నెల 19న అక్కడ పూజలు చేస్తామన్న శర్మ
- అనుమతి ఇవ్వకుంటే తాను చనిపోయేందుకు అంగీకరించాలని విజ్ఞప్తి
శ్రీకృష్ణుడి జన్మస్థలమని పేర్కొంటూ ఉత్తరప్రదేశ్ లోని షాహీ మసీదు ఈద్గాలో జన్మాష్టమి వేడుకలు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్‌ఎం) సభ్యుడు మంగళవారం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తన రక్తంతో లేఖ రాశారు. ఏబీహెచ్‌ఎం జాతీయ కోశాధికారి దినేశ్ శర్మ మాట్లాడుతూ ఆగస్టు 19న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్థానిక బ్రిజ్వాసీలతో కలిసి దేవుడికి పూజలు చేయాలన్నారు.
కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదానికి సంబంధించిన పలు దావాలు కోర్టులో ఉన్న సమయంలో ఈ విజ్ఞప్తులు రావడం గమనార్హం. కాట్రా కేశవ్ దేవ్ ఆలయానికి చెందిన స్థలంలో మసీదు నిర్మించారని, దానిని తొలగించాలని హిందూ పిటిషనర్లు కోర్టును కోరారు. ముస్లిం పక్షం ఈ వాదనను వ్యతిరేకించింది.
అయితే, కృష్ణుని ఆరాధన ఆయన జన్మస్థలం కాని ప్రదేశంలో నిర్వహిస్తున్నారని పేర్కొంటూ రాసిన లేఖను దినేశ్ శర్మ మీడియాకు విడుదల చేశారు. కృష్ణుడు జన్మించిన ప్రదేశం షాహీ మసీదు ఈద్గా కింద ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదిత్యనాథ్‌ను హనుమంతుని అవతారం అని కొనియాడిన శర్మ, మసీదులో పూజలు చేయడానికి ముఖ్యమంత్రి అనుమతి ఇస్తారని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే మాత్రం కృష్ణభగవానుడి జన్మస్థలంలో పూజ చేయని జీవితం విలువ లేనిది కాబట్టి తాను చనిపోయేందుకు అనుమతించాలని శర్మ అన్నారు.
కాగా, గతంలో శర్మ కోర్టులో సమర్పించిన ఇదే విధమైన దరఖాస్తు ఈనెల మూడో తేదీన తిరస్కరణకు గురైంది. షాహీ మసీదు ఈద్గాలో లడ్డు గోపాల్ (బాల్ కృష్ణ) జలాభిషేకం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మే 18న సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులో శర్మ దరఖాస్తును సమర్పించారు.