Edappadi Palaniswami: శశికళ, దినకరన్ లను పార్టీలో చేర్చుకోం: అన్నాడీఎంకే
- పళనిస్వామి నాయకత్వంలో పార్టీ బలంగా ఉందన్న జయకుమార్
- పన్నీర్ సెల్వం వెంట నాయకులు ఎవరూ లేరని ఎద్దేవా
- శశికళ, దినకరన్ లను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
జయలలిత చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే పార్టీలో ఊహించని పరిణామాలు ఎన్నో జరిగాయి. అధికారాన్ని పళనిస్వామి, పన్నీర్ సెల్వం పంచుకున్నారు. పళనిస్వామి సీఎంగా, పన్నీర్ సెల్వం డిప్యూటీ సీఎంగా అధికారాన్ని అనుభవించారు. ఇదే సమయంలో జయ నెచ్చెలి శశికళను, దినకరన్ ను పార్టీ నుంచి వెళ్లగొట్టారు. తాజాగా ఆ పార్టీలో మరిన్ని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా పన్నీర్ సెల్వంను, ఆయన అనుచరులందరినీ పార్టీ నుంచి బర్తరఫ్ చేశారు.
మరోవైపు, అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి డి.జయకుమార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో అన్నాడీఎంకే చాలా బలంగా ఉందని ఆయన అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రయోజనం లేదని చెప్పారు. పన్నీర్ సెల్వం వెంట నాయకులు ఎవరూ లేరని అన్నారు. పదుల సంఖ్యలో మాజీ నాయకులను వెంటేసుకుని అన్నాడీఎంకేను చేజిక్కించుకుంటానని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. శశికళ, దినకరన్ లను పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని... వారిని చేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదని అన్నారు.