Nadendla Manohar: రాష్ట్రంలో ఉపాధ్యాయులను వదిలించుకునే కుట్ర మొదలైంది: నాదెండ్ల మనోహర్
- పేదలకు విద్యను దూరం చేస్తున్నారన్న మనోహర్
- ఉపాధ్యాయులను వేధిస్తున్నారని విమర్శలు
- పిల్లలకు పాఠాలు చెప్పే సమయం తగ్గిస్తున్నారని ఆరోపణ
- టీచర్లను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడమే వైసీపీ ఆలోచన అని, ఇది పేదలకు విద్యను దూరం చేయడమేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి వదిలించుకునే కుట్ర మొదలైందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను వదలించుకుని ప్రభుత్వ పాఠశాలలను బైజూస్ వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారని, అందుకోసం జగన్ ప్రభుత్వం సంస్కరణలు, టెక్నాలజీ వినియోగం ముసుగు వేస్తోందని తెలిపారు.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఉచిత విద్య, దానిపై చేసే ఖర్చులను తగ్గించాలన్న ఉద్దేశంతోనే ముందుకు వెళుతున్నారని, అందులో భాగంగానే ఉపాధ్యాయులను వేధించే చర్యలకు పాల్పడుతున్నారని నాదెండ్ల మనోహర్ వివరించారు. టీచర్లను బోధన విధులకు దూరం చేస్తూ, మరుగుదొడ్ల ఫొటోలు తీయించడం, మద్యం షాపుల వద్ద డ్యూటీలు వేయడం, కోడిగుడ్ల లెక్కలు రాయడం వంటి సంబంధం లేని పనులకు బాధ్యులను చేస్తున్నారని వెల్లడించారు. తద్వారా పిల్లలకు పాఠాలు చెప్పేందుకు సమయం తగ్గిస్తున్నారని ఆరోపించారు.
తాజాగా ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించి ఫేస్ రికాగ్నిషన్ యాప్ అంటూ అయోమయానికి గురిచేస్తున్నారని నాదెండ్ల తెలిపారు. ఇంటి గడప దాటి సచివాలయానికి వెళ్లని సీఎం జగన్ కూడా ఉపాధ్యాయుల హాజరులో నిమిషం ఆలస్యమైతే ఆబ్సెంట్ అంటూ ఉత్తర్వులు ఇప్పించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. వైసీపీ సర్కారు ఉద్యోగులను వేధిస్తున్న తీరును, తమకు దక్కాల్సిన జీతభత్యాల గురించి, ఎన్నికల వేళ హామీ ఇచ్చిన సీపీఎస్ రద్దు గురించి ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు కాబట్టే ప్రభుత్వం వారిని వేధిస్తోందని ఆరోపించారు.
బోధనకు దూరం చేసి, హాజరు పేరిట బలవంతంగా సెలవులు పెట్టించి ప్రజలకు ఉపాధ్యాయులను శత్రువులుగా చూపించాలని వైసీపీ నిర్ణయించుకుందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలను మూసివేసే పని మొదలుపెట్టారని, ఈ క్రమంలో ఉపాధ్యాయులను వేధించి వదిలించుకుని, పాఠశాలలను బైజూస్ వంటి తమకు దగ్గరైన సంస్థలకు అప్పగించే కుట్రతో వైసీపీ ఉందని నాదెండ్ల విమర్శించారు. ఈ చర్యలను జనసేన పార్టీ ఖండిస్తుందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులను బోధన విధులకు మాత్రమే పరిమితం చేయాలని, అర్థం లేని యాప్స్, ఫొటోలు తీయడం వంటి పనులను పక్కనబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.