Allu Arjun: అల్లు అర్జున్ ఇవాళ పాన్ ఇండియా స్టార్: బాలీవుడ్ దర్శకుడు రవి రాయ్
- బన్నీ ఫాన్ లిస్టులో బాలీవుడ్ దర్శకుడు
- ఒకప్పుడు అల్లు అర్జున్ గురించి ఎవరికీ తెలియదని వ్యాఖ్య
- పుష్పతో పరిస్థితి మారిపోయిందని వివరణ
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో ఆలిండియా లెవల్లో పేరు తెచ్చుకున్నారు. పుష్ప హిందీ వెర్షన్ తో బాలీవుడ్ లోనూ తన ముద్ర వేశాడు. బాలీవుడ్ స్ట్రెయిట్ చిత్రాలు సైతం పుష్ప హవా ముందు నిలవలేకపోయాయి. హిందీ చిత్రాల విమర్శకులు సైతం బన్నీ నటనను వేనోళ్ల పొగిడారు. తాజాగా, బాలీవుడ్ సినీ, బుల్లితెర దర్శకుడు రవి రాయ్ కూడా అల్లు అర్జున్ అభిమానుల జాబితాలో చేరిపోయారు. అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అని అభివర్ణించారు.
ఇంతకుముందు, అల్లు అర్జున్ అంటే ఎవరో దక్షిణాది చిత్ర పరిశ్రమ సరిహద్దులు దాటితే ఎవరికీ తెలిసేది కాదని, ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. పుష్ప హిందీ డబ్బింగ్ చిత్రంతో తెలుగులో కంటే ఇతర ప్రాంతాల్లో పెద్ద స్టార్ అయిపోయాడని రవి రాయ్ కితాబునిచ్చారు.
"పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా... ఫైర్", "తగ్గేదే లే" అనే ఈ డైలాగులే లేకపోతే ఇవాళ అల్లు అర్జున్ గురించి మనం మాట్లాడుకునేవాళ్లం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రెండు లైన్లే పుష్పను పాన్ ఇండియా సినిమాగా నిలిపాయని పేర్కొన్నారు. డేవిడ్ వార్నర్ వంటి క్రికెటర్లు సైతం తగ్గేదే లే అంటూ తెలుగులో కాకుండా, జూకేగా నహీ సాలా అంటూ హిందీలో డైలాగులు చెప్పేంతగా పుష్ప అద్భుతం సృష్టించిందని అన్నారు.