Varavara Rao: ఎన్ఐఏ కోర్టు అనుమతిస్తేనే హైదరాబాద్ కు వరవర రావు
- కంటి చికిత్స కోసం వెళ్లేందుకు అనుమతి కోరిన వరవరరావు
- ఎన్ఐఏ ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించిన సుప్రీం
- భీమా కోరేగావ్ కేసులో ఈమధ్యే షరతులతో బెయిల్ మంజూరు
హైదరాబాద్ వెళ్లాలంటే జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్‌ఐఏ) కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని విప్లవ రచయిత వరవరరావుకు సుప్రీంకోర్టు సూచించింది. భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు అత్యున్నత న్యాయస్థానం ఈ మధ్యే బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన మెడికల్ బెయిల్‌పై విడుదలైన వరవరరావు గ్రేటర్ ముంబైని విడిచిపెట్టరాదని కోర్టు స్పష్టం చేసింది.
అయితే, కంటి చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వరవరరావు తరఫు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదనలు వినిపించారు. స్వస్థలమైన హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుంటే ఆ వాతావరణంలో వరవరరావు త్వరగా కోలుకుంటారని గ్రోవర్ కోర్టుకు తెలిపారు.
ఎన్‌ఐఏ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు ఈ అభ్యర్థనను వ్యతిరేకించారు. గతంలో మూడు నెలల సమయం ఇచ్చినప్పుడు వరవరరావు శస్త్రచికిత్సకు వెళ్లలేదని చెప్పారు. అయితే, వరవరరావు అభ్యర్థనను తాము పరిగణనలోకి తీసుకునే బదులు రెండు వారాల్లోగా సంబంధిత ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను పిటిషనర్‌కు ఇస్తున్నామని బెంచ్ తెలిపింది.
కాగా భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో వరవరరావు నిందితుడిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాగించిన కుట్రలో భాగస్వామిగా మారారని ఆరోపిస్తూ వరవరరావు, సుధా భరద్వాజ్ సహా 16 మందిని 2018 ఆగస్టులో ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. 82 ఏళ్ల వయసున్న వరవరరావు ఇప్పటికే రెండున్నరేళ్లపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండటంతో సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన శాశ్వత మెడికల్ బెయిల్‌ను మంజూరు చేసింది.