Monkey: ‘అర్జెంట్.. అర్జెంట్..’ ఎమర్జెన్సీ సర్వీస్ కు కోతి పిల్ల ఫోన్.. ఆగమాగమైన పోలీసులు!

Monkey calls emergency service from zoo

  • అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ జూలో ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి పిల్ల
  • దాన్ని నొక్కుతూ ఉండగా అత్యవసర సర్వీస్ 911కు వెళ్లిన ఫోన్ కాల్
  • ఎవరికో ఏదో ఆపద వచ్చిందనుకుని పరుగులు పెట్టిన పోలీసులు
  • చివరికి కోతి పనిగా గుర్తించి నవ్వుకున్న వైనం

అది అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతం.. అత్యవసర సర్వీస్ 911 కు ఓ ఫోన్ కాల్ వచ్చింది.. అవతలి నుంచి కొన్ని చప్పుళ్లు మాత్రమే వస్తున్నా.. ఎవరూ మాట్లాడటం లేదు. కాసేపటికే ఫోన్ కట్ అయిపోయింది. మనకు ఏదైనా ఆపద వస్తే డయల్ 100కు కాల్ చేసినట్టుగా.. అమెరికాలో 911 ఎమర్జెన్సీ నంబర్ ను కాల్ చేస్తుంటారు. దీంతో ఎవరో ఆపదలో ఉన్నారేమో అని పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ ఫోన్ లొకేషన్ ను ట్రేస్ చేశారు. పాసో రోబుల్స్ ప్రాంతంలోని జూ లో నుంచి ఫోన్ చేసినట్టు గుర్తించారు. వెంటనే సాన్ లూస్ పోలీసు అధికారులు జూ వద్దకు చేరుకున్నారు.

జూ లోపలికి వెళ్లాక అధికారులు ఎంతగా గాలించినా ఆపదలో ఉన్న ఎవరూ కనిపించలేదు. ఆ ఫోన్ కు మళ్లీ మళ్లీ కాల్ చేసినా రింగ్ అవుతోందే తప్ప ఎవరూ ఎత్తడం లేదు. దీనితో పోలీసుల్లో మరింత టెన్షన్ మొదలైంది. కాసేపటి తర్వాత కపుచిన్ జాతికి చెందిన రూట్ అనే కోతి పిల్ల ఆ ఫోన్ చేసినట్టు గుర్తించారు.

జూ సెల్ ఫోన్ ను ఎత్తుకెళ్లి.. 
జూలో సామగ్రిని అటూ ఇటూ తరలించేందుకు వినియోగించే బండి నుంచి ఆ కోతి పిల్ల ఫోన్ ను ఎత్తుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఫోన్ ను ఎత్తికెళ్లిన కోతి పిల్ల.. దానిపై నంబర్లను నొక్కుతూ, నొక్కుతూ ఉండగా 911 కు కాల్ వచ్చినట్టు తేల్చారు. మెల్లగా ‘రూట్’ కోతిపిల్లను పట్టుకుని దాని నుంచి ఫోన్ తీసుకున్నారు. 

ఈ సమయంలో ఆ కోతిపిల్ల అమాయకంగా ముఖం పెట్టడం, గందరగోళానికి గురవడం చూసి భలే నవ్వు వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ జూలో కోతులు ఏది దొరికితే అది పట్టుకుపోవడం తరచూ జరుగుతుంటుందని.. కానీ ఇలా ఫోన్ ఎత్తుకెళ్లడం, దాని నుంచి సరిగ్గా 911 కు కాల్ చేయడం మాత్రం చిత్రమేనని అన్నారు. ఈ కోతి పిల్ల వ్యవహారానికి సంబంధించి.. ఆ కోతి పిల్ల ఫొటోలతో ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. 

  • Loading...

More Telugu News