Jagan: జగన్ ను కలిసి థ్యాంక్స్ చెప్పిన నాయీ బ్రాహ్మణులు
- నాయీబ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం విధించిన ఏపీ ప్రభుత్వం
- నిషేధిత పదాలు వాడితే చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు
- తమ ఆత్మగౌరవాన్ని కాపాడారంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన నాయీబ్రాహ్మణులు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. నాయీ బ్రాహ్మణులను, నాయీబ్రాహ్మణ సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడారంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్న పదాలను ఉపయోగిస్తే... నాయీ బ్రాహ్మణులను అవమానపరిచినట్టుగా, వారి మనోభావాలను దెబ్బతీసినట్టుగా భావిస్తారు. ఎవరైనా ఈ పదాలు వాడితే వారిపై భారత శిక్షాస్మృతి 1860 కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.