Andhra Pradesh: నేడు బలపడనున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
- పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంలో వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం
- తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ
- ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి నేడు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు చోట్ల నేడు, రేపు ఓ మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఉత్తర కోస్తా, యానాంలలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు, లేదంటే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. దక్షిణ కోస్తాలోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అధికారులు.. రాయలసీమలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.