MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ హత్యకేసు.. చార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు

kakinada police submitted Chargesheet against mlc ananthababu

  • సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు
  • మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఎమ్మెల్సీ
  • మరిన్ని ఆధారాలతో అదనపు చార్జ్‌షీట్‌ను కూడా దాఖలు చేస్తామన్న కాకినాడ ఎస్పీ

మాజీ డ్రైవర్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో పోలీసులు ఎట్టకేలకు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. చార్జ్‌షీట్ దాఖలు చేయడం మరో రెండు రోజులు ఆలస్యమై ఉంటే ఆయనకు స్వచ్ఛందంగా బెయిలు లభించి ఉండేది. దీంతో బెయిలు అవకాశాన్ని ఆయన కోల్పోయారు. 

ఈ ఏడాది మే 19న అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అదే నెల 23న పోలీసులు అనంతబాబును అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్నారు. పలుమార్లు ఆయన పెట్టుకున్న బెయిలు పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మరోవైపు, నెలలు గడుస్తున్నా పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేయకుండా నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి.

ఏదైనా కేసులో ఏవరైనా అరెస్ట్ అయితే 90 రోజుల్లోపు చార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే నిందితుడు స్వచ్ఛందంగా బెయిలు పొందేందుకు అర్హత లభిస్తుంది. ఈ నేపథ్యంలో సరిగ్గా 88వ రోజునాడు అంటే స్వచ్ఛంద బెయిలు అర్హత లభించడానికి రెండు రోజుల ముందు పోలీసులు నిన్న ప్రిలిమినరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 

ఈ మేరకు కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. కేసుకు మరింత బలం చేకూరేలా మరిన్ని ఆధారాలతో అదనపు చార్జ్‌షీట్ కూడా దాఖలు చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో మూడో బెయిలు పిటిషన్‌పై నిన్న మరోమారు వాదనలు జరిగాయి. నిందితుడు అనంతబాబు తరపు న్యాయవాది మరోమారు వాయిదా కోరడంతో ఇరువర్గాల వాదనలు వినేందుకు ఈ నెల 22కి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News