Netflix: నెట్ ఫ్లిక్స్ చౌక ప్లాన్.. అయితే, ఆఫ్ లైన్ వీడియో వీక్షణ ఉండదట!
- వాణిజ్య ప్రకటనలతో చౌక ప్లాన్ తెచ్చే సన్నాహాలు
- కస్టమర్లు చేజారిపోకుండా చర్యలు
- లీకైన కొంత సమాచారం
నెట్ ఫ్లిక్స్ చౌక ప్లాన్లను తీసుకురానున్నట్టు అధికారికంగా గతంలో ప్రకటించింది. వాణిజ్య ప్రకటనలతో ఈ ప్లాన్లు ఉంటాయని తెలిపింది. దీనిపైనే నెట్ ఫ్లిక్స్ పనిచేస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఇటీవలి కాలంలో చందాదారులను కోల్పోతోంది. 2022 మొదటి మూడు నెలల్లో 2 లక్షల మంది చందాదారులు సంస్థ నుంచి వెళ్లిపోయారు. తర్వాత మూడు నెలల్లో (ఏప్రిల్-జూన్) 9,70,000 మంది సంస్థను వీడారు. దీంతో కస్టమర్ల సంఖ్యను పెంచుకునేందుకు చౌక ప్లాన్లను తీసుకువచ్చే ప్రణాళికలతో నెట్ ఫ్లిక్స్ ఉంది.
దీనికి సంబంధించి కొంత సమాచారం లీక్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ తీసుకొచ్చే ఈ చౌక ప్లాన్ (నెట్ ఫ్లిక్స్ విత్ యాడ్స్)లో ఆఫ్ లైన్ వీక్షణ ఫీచర్ ఉండదు. షోలు, మూవీలను యాప్ లోకి డౌన్ లోడ్ చేసుకుని, తర్వాత చూడ్డానికి వీలు పడదు. ప్రయాణంలో ఉన్న వారికి ఆఫ్ లైన్ వ్యూయింగ్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. నెట్ కవరేజీ సరిగ్గా లేకపోయినా, కంటెంట్ ను చూసుకోగలరు. నెట్ ఫ్లిక్స్ విత్ యాడ్స్ ప్లాన్ గురించి సంస్థ ఇంకా ఎటువంటి అధికారిక సమాచారాన్ని విడుదల చేయలేదు.