New Delhi: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి నివాసం సహా 21 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు.. ఎఫ్ఐఆర్ లో సిసోడియా పేరు
- కొత్త ఎక్సైజ్ పాలసీ కేసులో దాడులు చేస్తున్న సీబీఐ
- ఎఫ్ఐఆర్ లో మనీశ్ సహా నలుగురు ప్రజా ప్రతినిధుల పేర్లు
- మంచి చేసే వారిని కేంద్రం వేధిస్తోందన్న సిసోడియా
- న్యూయార్క్ టైమ్స్ సిసోడియాను మెచ్చుకున్న రోజే దాడులన్న కేజ్రీవాల్
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మరో ముగ్గురు ఆప్ ప్రజా ప్రతినిధుల నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీలో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలతో ఢిల్లీ- ఎన్సీఆర్ సెక్టార్ లోని 21 ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు సీబీఐ అధికారులు చెబుతున్నారు.
అంతకుముందు ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగినట్టు నివేదిక రావడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణ కోరారు. ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ మనీశ్ సిసోడియా సహా నలుగురి పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చి సోదాలు చేస్తోంది. ‘మేక్ ఇండియా నంబర్ వన్’ పేరిట ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ వ్యాప్త ప్రచార కార్యక్రమం ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఈ దాడులు జరగడం చర్చనీయాంశమైంది.
ఈ దాడులపై మనీశ్ సిసోడియా స్పందించారు. దేశంలో మంచి చేసేవారిని ఇలా వేధింపులకు గురి చేయడం దురదృష్టకరం అన్నారు. ‘నా ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. నేను సీబీఐ అధికారులకు సహకరిస్తాను. విద్యా రంగంలో నేను చేస్తున్న పనిని ఎవరూ ఆపలేరు. నిజం బయటకు వస్తుంది’ అని ట్వీట్ చేశారు.
అదే సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్‌ను మెచ్చుకుంటూ అమెరికాలోని అతిపెద్ద వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో మనీశ్ ఫొటోతో కూడిన కథనం వేసిన రోజే కేంద్రం ఆయన ఇంటికి సీబీఐని పంపించింది. సీబీఐని మేం స్వాగతిస్తున్నాం. పూర్తిగా సహకరిస్తాం. గతంలో కూడా మేం ఎన్నో పరీక్షలు, దాడులు ఎదుర్కొన్నాం. కానీ, ఏమీ బయటకు రాలేదు. ఇప్పుడూ ఏమీ రాదు’ అని ట్వీట్ చేశారు.
మరోవైపు సిసోడియా జైలుకు వెళ్లడం ఖాయం అని బీజేపీ విమర్శిస్తోంది. ఆప్ అవినీతికి పాల్పడటం ఇదే తొలిసారి కాదని, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో భారీ అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.