Aadi Saikumar: మూవీ రివ్యూ: 'తీస్ మార్ ఖాన్'
- ఈ రోజునే రిలీజైన 'తీస్ మార్ ఖాన్'
- ఆకట్టుకోలేకపోయిన కథ
- ఆసక్తిని రేకెత్తించలేకపోయిన కథనం
- రొటీన్ గా అనిపించే డ్రామా
ఆది సాయికుమార్ హీరోగా యాక్షన్ ఎంటర్టయినర్ జోనర్లో కల్యాణ్ జీ గోగణ 'తీస్ మార్ ఖాన్' సినిమాను రూపొందించాడు. పాయల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సునీల్ .. కబీర్ దుహాన్ సింగ్ .. అనూప్ సింగ్ ఠాకూర్ .. పూర్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆది సాయికుమార్ కి, ఈ సినిమా హిట్ ఇచ్చే అవకాశాలేమైనా కనిపిస్తున్నాయా అనేది ఇప్పుడు చూద్దాం.
రెండు వేరు వేరు కుటుంబాలకు చెందిన ఒక అబ్బాయి .. ఒక అమ్మాయికి ఇంట్లో ఆదరణ కరవవుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆ ఇద్దరూ ఒకచోట కలుసుకుంటారు. ఇకపై ఒకరికి ఒకరు అండగా ఉండాలని నిర్ణయించుకుని కష్టపడి బ్రతుకుతుంటారు. ఆ అమ్మాయిని ఆ కుర్రాడు 'అమ్మా' అని పిలుస్తూ ఉంటాడు. ఆమె కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు. పది .. పన్నెండేళ్ల ఆ కుర్రాడు 'అమ్మ'ని కాస్త తేడాగా చూశారనే కోపంతో 30 మంది రౌడీలను ఉతికారేస్తాడు. అందుకే అతనికి 'తీస్ మార్ ఖాన్' అని పేరు.
తన చిన్నప్పటి నుంచి తనని బిడ్డలా చూసుకున్న అమ్మ (పూర్ణ) అంటే తీస్ మార్ ఖాన్( ఆది సాయికుమార్) కి ప్రాణం. ఒక వైపున జిమ్ నడుపుతూ .. మరో వైపున సెటిల్ మెంట్లు చేస్తూ ఉంటాడు. పూర్ణ భర్తగా ఆ ఇంట్లోకి చక్రి (సునీల్) ఎంటరవుతాడు. తీస్ మార్ ఖాన్ తనకి అనుకోకుండా తారసపడిన 'అనఘ' (పాయల్) తో ప్రేమలో పడతాడు. ఆమెను ట్రాకులో పెట్టడం కోసం కాలేజ్ స్టూడెంట్ గా మారతాడు. మొత్తానికి ఆమెను ప్రసన్నం చేసుకుని అనుకున్నది సాధిస్తాడు. అలాంటి పరిస్థితుల్లోనే తీస్ మార్ ఖాన్ తో తన్నులు తిన్న లోకల్ రౌడీ 'ఖాసిమ్' నేరుగా వెళ్లి 'జీజే'కి ఆ విషయం చెబుతాడు.
జీజే (ఠాకూర్ అనూప్ సింగ్) ఆ ప్రాంతంలో జరిగే అన్ని అక్రమ కార్యకలాపాలకు అధిపతి. అవినీతి మార్గంలో తనని అనుసరించే వాళ్లందరికీ ప్రతినిధి. తీస్ మార్ ఖాన్ పేరును అతను అంతకుముందే విని ఉంటాడు. తాను చంపాలనుకున్న హోమ్ మినిస్టర్ రంగరాజన్ (శ్రీకాంత్ అయ్యంగార్)ని కాపాడింది అతనేనని తెలుసుకుంటాడు. ఆ కోపంతో తీస్ మార్ ఖాన్ అంతు చూడాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగుతాడు. ఇక అప్పటి నుంచి తీస్ మార్ ఖాన్ కి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వాటిని ఆయన ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే కథ.
దర్శకుడు కల్యాణ్ జీ తయారు చేసుకున్న ఈ కథలో ఎంత మాత్రం కొత్తదనం లేదు. స్క్రీన్ ప్లే ఏ మాత్రం ఆసక్తికరంగా అనిపించదు. పది .. పన్నెండేళ్ల కుర్రాడు 30 మంది రౌడీలను చితగ్గొట్టడం .. ఆ ఫైట్ లో నుంచి అతనికి పేరు .. ఈ సినిమాకి టైటిల్ పుట్టుకు రావడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఆ వయసు కుర్రాడు తన కంటే వయసులో పెద్దదైన ఒక అమ్మాయిని 'అక్క' అంటే బాగుండేది .. 'అమ్మ' అని పిలిపించడం నప్పలేదు. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తక్కువగా ఉండటం అందుకు కారణం. ఆమెను అక్క అని పిలిపించడం వలన ఎమోషన్ పాళ్లు ఏ మాత్రం తగ్గవు కూడా.
పిల్లల ఎపిసోడ్ తోనే కథ మొదలవుతుంది .. నిజానికి ఆ ఎపిసోడ్ మొత్తాన్ని ఎక్కడో ఒక చోట సింగిల్ డైలాగ్ లో చెప్పించవచ్చు. అలాంటి లైన్ ను చాలా సేపు లాగారు. ప్రధానమైన పాత్రలలో దేనినీ కూడా దర్శకుడు సరిగ్గా డిజైన్ చేసుకోలేదు. ఆది సాయికుమార్ - పాయల్ జోడీ ఎంతమాత్రం సెట్ కాలేదు. సెకండాఫ్ లో కొన్ని పాత్రల ద్వారా ట్విస్టులు ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నించాడు కానీ, అవి మరీ నాటకీయంగా అనిపిస్తాయి. ఇక హోమ్ మినిస్టర్ అనుమతితో హీరో పోలీస్ ఆఫీసర్ కావడమనే పాయింటు, ఆ మధ్య వచ్చిన బన్నీ సినిమాలో మనకి తగిలిందే.
ఇలా కథ .. కథనాలు ఒకదానికి మించి మరొకటి బలహీనంగా కనిపిస్తాయి. ఎక్కడికక్కడ పాత్రలు .. సన్నివేశాలు తేలిపోతుంటాయి. కిడ్నాపులు .. ట్విస్టులు అన్నీ కూడా రోటీన్ గా అనిపిస్తాయి. చివర్లో ఏదో కొత్త పాయింట్ చెప్పడానికి ట్రై చేశారుగానీ .. అది ఆడియన్స్ కి ఎక్కదు. తెరపై జరుగుతున్న ఏ ఒక్క సీన్ తో ప్రేక్షకులు కనెక్ట్ కారు. ఆది సాయికుమార్ ఎప్పటిలానే చేశాడు. ఇప్పటికైనా ఆయన రొటీన్ కి భిన్నమైన పాత్రలను ఎంచుకోకపోతే కష్టమే. కాస్త ఒళ్లు చేయకపోతే పాయల్ పరిస్థితి కూడా అంతే. యంగ్ విలన్ గా ఈ తరహా పాత్రలు చేయడం అనూప్ సింగ్ ఠాకూర్ కి అలవాటే.
సాయికార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫరవాలేదు .. ఓ రెండు పాటలు ఫరవాలేదనిపిస్తాయి. బాల్ రెడ్డి ఫొటోగ్రఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ విషయానికి వస్తే మాత్రం ఓ మాదిరి మార్కులే పడతాయి. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ఉన్నప్పటికీ, ఏ మాత్రం సహజత్వం లేని ఆవిష్కరణ కారణంగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పచ్చు.
--- పెద్దింటి గోపీకృష్ణ