YSRCP: వైసీపీని వీడి టీడీపీలో చేరిన గోవర్ధన్ రెడ్డి... సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు
- దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి సోదరుడి కుమారుడే గోవర్ధన్ రెడ్డి
- పదేళ్ల పాటు వైసీపీలో కొనసాగిన వైనం
- అనుచరులతో కలిసి టీడీపీలో చేరిన తెనాలి నేత
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైసీపీ నేత గుదిబండ గోవర్ధన్ రెడ్డి శుక్రవారం అధికార పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి విపక్ష టీడీపీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు... గోవర్ధన్ రెడ్డి, ఆయన అనుచరులకు పార్టీ కండువాలు కల్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై ఆరోపణలు గుప్పించారు. జగన్ మళ్లీ సీఎం అయితే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదన్న భావనలో ప్రజలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఓ స్పష్టమైన లక్ష్యంతోనే తాను టీడీపీలో చేరుతున్నానని ఆయన పేర్కొన్నారు. దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి సోదరుడి కుమారుడే గోవర్ధన్ రెడ్డి. పదేళ్లపాటు వైసీపీలో కొనసాగిన ఆయన తాజాగా టీడీపీలో చేరడం గమనార్హం.
గోవర్ధన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు... జగన్ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఆ పార్టీ నేతలే తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఇందుకు నిదర్శనమే గోవర్ధన్ రెడ్డి ఆ పార్టీని వీడటమేనన్నారు. మనసున్న కార్యకర్తలు వైసీపీలో కొనసాగేందుకు ఇష్టపడటం లేదని కూడా చంద్రబాబు అన్నారు. వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకు ప్రజలందరూ టీడీపీతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.