Lalu Prasad Yadav: నితీశ్ కుమార్ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ అల్లుడి పెత్తనం.. బీజేపీ విమర్శలు!
- పర్యావరణ, అటవీశాఖ మంత్రిగా తేజ్ ప్రతాప్ యాదవ్
- తేజ్ ప్రతాప్ సమావేశాలకు హాజరవుతున్న శైలేశ్ కుమార్
- అధికారులకు నేరుగా ఆదేశాలను జారీ చేస్తున్న వైనం
జేడీయూ, ఆర్జేడీ తదితర పార్టీల కలయికతో బీహార్ లో మహాఘటబంధన్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. నితీశ్ సీఎంగా, తేజస్వి యాదవ్ డిప్యూటీగా బాధ్యతలను చేపట్టారు. మరోవైపు ప్రభుత్వ అధికారిక కార్యకలాపాల్లో, సమావేశాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు శైలేశ్ కుమార్ పాలుపంచుకుంటుండటం వివాదాస్పదమవుతోంది. లాలూ కుమార్తె, ఆర్జేడీ రాజ్యసభ సభ్యురాలు మీసా భారతి భర్తే శైలేశ్ కుమార్.
లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన పర్యావరణ, అటవీశాఖలకు సంబంధించి రెండు అధికారిక సమావేశాలను నిర్వహించారు. ఈ రెండు సమావేశాల్లో శైలేశ్ కుమార్ పాల్గొన్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై విపక్షాలు, ముఖ్యంగా బీజేపీ మండిపడుతోంది.
తన అధికార విధులను బావ శైలేశ్ కుమార్ కు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇచ్చారని బీజేపీ సీనియర్ నేత సునీల్ కుమార్ మోదీ మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ... అధికారులకు నేరుగా ఆదేశాలను జారీ చేస్తున్నారని విమర్శించారు. దీనిపై సీఎం నితీశ్ కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.