mosquito bite: ఏ దోమ కాటుతో ఎలాంటి సమస్య వస్తుందో తెలుసా..?
- దోమల కారణంగా ఎన్నో వైరస్ లు
- వీటితోనే డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక జ్వరాలు
- జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకూడదు
- వ్యాధి నిర్ధారణకు వెళ్లాల్సిందే
దోమల కారణంగా మానవాళికి వచ్చే ఆరోగ్య సమస్యలు బోలెడు. మలేరియా, డెంగీ, చికున్ గున్యా ఇలా ఎన్నో ఉన్నాయి. మలేరియా ఐదు రకాల పరాన్నజీవుల నుంచి మనకు సంక్రమిస్తుంది. మలేరియా, డెంగీ ప్రాణాంతకాలు. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్లాది మంది దోమల కారణంగా అనారోగ్యం పాలవుతుంటారు. మలేరియా, జికా, డెంగీ కారణంగా లక్షలాది మంది చనిపోతున్నారు కూడా. కనుక వచ్చింది ఏ సమస్య అన్నది తెలియకుండా జ్వరం ఉందని ఏవో తెలిసిన మాత్రలు వేసుకుని ప్రాణాంతకం చేసుకోకూడదు. వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు నడుచుకోవాలి.
డెంగీ, చికున్ గున్యా జ్వరాలను వైరల్ ఫీవర్లు గానే చెబుతారు. డెంగీలో ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఫ్లూ మాదిరి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రంగా ఉంటే ప్లేటులెట్లు పడిపోవడం, రక్తస్రావం, అవయవాల పనితీరు క్షీణించడం, ప్లాస్మా లీకేజీ సమస్యలు తలెత్తుతాయి. సరిగ్గా చికిత్స తీసుకోకపోతే ఇది ప్రాణాంతకం అవుతుంది. మలేరియా కూడా అంతే. చికున్ గున్యాలో అంత రిస్క్ ఉండదు. దోమలు కుట్టి మన రక్తంలోకి ప్రవేశపెట్టే పరాన్నజీవులతో వచ్చే వ్యాధులు ఇలా ఎన్నో ఉన్నాయి.
ఏడిస్ దోమ తెచ్చే వైరస్ లు..
చికున్ గున్యా(వైరస్), డెంగీ(వైరస్), లింఫాటిక్ ఫైలేరియాసిస్ (ప్యారాసైట్), రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(వైరస్), ఎల్లో ఫీవర్(వైరస్), జికా (వైరస్)
అనాఫిలిస్ తెచ్చే వైరస్ (పరాన్నజీవి) లు
లింఫాటిక్ ఫైలేరియాసిస్ (ప్యారాసైట్)
మలేరియా (ప్యారాసైట్)
క్యులెక్స్ దోమ తెచ్చే వైరస్ లు
జపనీస్ ఎన్ సెఫలైటిస్ (వైరస్)
లింఫాటిక్ ఫైలేరియాసిస్ (ప్యారాసైట్)
వెస్ట్ నిలే ఫీవర్ (వైరస్)