CPI: మునుగోడులో టీఆర్ఎస్ కే మా మద్దతు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
- స్వార్థం కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని ఆరోపణ
- బీజేపీని ఓడించగల పార్టీకే తాము మద్దతు ఇస్తున్నామని వెల్లడి
- టీఆర్ఎస్ కు మద్దతిచ్చినంత మాత్రాన ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని వెల్లడి
దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందని.. అందుకే కమ్యూనిస్టులు అప్రమత్తమయ్యారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. బీజేపీని ఓడించే పార్టీకే తాము మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని.. ఆ శక్తి టీఆర్ఎస్ కే ఉందని చెప్పారు. మునుగోడులో ఐదు సార్లు సొంతంగా గెలిచామని.. రెండు సార్లు ఇతర పార్టీల మద్దతుతో గెలిచామని చాడ వెంకటరెడ్డి గుర్తు చేశారు. బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని.. రాష్ట్ర విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు.
అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ వెంటే..
మునుగోడులో పోటీ చేసేందుకు సీపీఐ సిద్ధంగా లేదని.. అందుకే బీజేపీని ఓడించే పార్టీకే తమ మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నామని ప్రకటించారు. మునుగోడు సభకు సీపీఐ నేతలు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారని.. మునుగోడే కాదు అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కలిసి పని చేస్తామని చెప్పారు. స్వార్థం కోసమే తన ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రగతిశీల శక్తుల ముందు నిలవలేమని అమిత్ షాకు అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.