Munugodu: మన చేతిలో అధికారాన్ని ఎవరికో అప్పగించొద్దు.. మునుగోడు సభలో కేసీఆర్!
- ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా ఉప ఎన్నిక తేవాల్సిన పనేమిటన్న కేసీఆర్
- దీని వెనుక ఏం మాయ ఉందో గమనించాలని ప్రజలకు పిలుపు
- దేశాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ప్రకటించిందని వెల్లడి
ప్రజల చేతిలో ఉండే ఒకే ఒక్క ఆయుధం ఓటు అని.. దాని ద్వారా మనకు ఉపయోగపడేది ఏమిటని గుర్తుంచుకుని ఓటు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. మునుగోడులో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘జై తెలంగాణ’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నిక రావడం వెనుక ఉన్న ఉద్దేశమేమిటో ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు.
మన కోసం ఎవరూ పోరాడరు..
‘‘నల్లగొండ జిల్లా గతంలో ఫ్లోరైడ్ సమస్యతో ఎంతో బాధపడింది. ఆ సమస్య నుంచి ప్రజలను రక్షించుకునేందుకు ఎన్నో పోరాటాలు చేశాం. నాడు ప్రధాన మంత్రి దగ్గరికి బాధితులను తీసుకెళ్లి చూపించినా పట్టించుకోలేదు. మేం తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాక.. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యను అందరి దృష్టికి తీసుకెళ్లాం. పోరాటాలు, ఉద్యమాలతో తెలంగాణ తెచ్చుకుని.. మిషన్ భగీరథ ప్రాజెక్టు తెచ్చి.. సురక్షిత మంచినీళ్లు ఇచ్చుకున్నాం. ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టినం. ఇంకా కొంత చేయాల్సి ఉంది. ఇలాంటి సమయంలో మన చేతిలోని అధికారాన్ని ఎవరికో అప్పగించుకుని ఇబ్బంది తెచ్చుకోవద్దు. మన కోసం ఎవరూ పోరాడరు. ఆలోచించుకుని ఓటు వేయాలి..’’ అన్నారు కేసీఆర్.
ఉప ఎన్నిక వెనుక గోల్ మాల్ ఆలోచించాలి..
‘‘ఇక్కడ గోల్ మాల్ చేసి ఉప ఎన్నిక వచ్చేలా చేశారు. ఇంకో ఏడాదిలోనే ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక తేవాల్సిన అవసరం ఏమిటి? మిమ్మల్ని ఇలా ఎర్రటి ఎండలో నిలబెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? దీని వెనుకాల మాయా మశ్చీంద్ర ఏమిటి? గుర్తించకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది..” అని కేసీఆర్ చెప్పారు.
ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలి..
‘‘మొన్న సీపీఎం, సీపీఐ నాయకులతో ఒకే మాట చెప్పాను. మనమంతా విడిపోయి ఉండొద్దు. ఐక్యంగా ఉండాలి. ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రగతిశీల, క్రియాశీల శక్తులన్నీ ఏకం కావాలి, ఈ దుర్మార్గులను సాగనంపాలి. అప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది, దేశం బాగుపడుతుందని అభిప్రాయాలను పంచుకున్నాం. చిన్న చిన్న అంశాలను పక్కనపెడితే.. దేశం జీవికనే దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో.. మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపించడమే సరైనదని నిర్ణయించి సీపీఐ వారు మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ తరఫున సీపీఐకి ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని కేసీఆర్ పేర్కొన్నారు.