Amit Shah: అమిత్ షాతో సమావేశం కానున్న జూనియర్ ఎన్టీఆర్!
- స్వయంగా ఆహ్వానించిన కేంద్ర హోం మంత్రి
- ఈ రోజు రాత్రి హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో భేటీ!
- రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పరిణామం
మునుగోడు సభకు కోసం తెలంగాణ వస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో టాలీవుడ్ అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కాబోతున్నారని తెలుస్తోంది. మునుగోడు సభ ముగిసిన తర్వాత హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా రాత్రి 8 గంటలకు నోవాటెల్ హోటల్ లో పార్టీకి చెందిన పలువురు నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీకి రావాలని షా నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం వచ్చిందని తెలుస్తోంది. అమిత్ షాను కలవడానికి తారక్ హోటల్ కు వెళ్లబోతున్నారని సమచారం. దాదాపు 15 నిమిషాలు ఎన్టీఆర్ తో షా భేటీ అవుతారని తెలుస్తోంది.
గతంలో ఎన్టీఆర్ 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆయన ప్రచారానికి, ప్రసంగాలకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ, ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయలేదు. గతంలో టీడీపీ మహానాడుకు హాజరైన తారక్.. కొన్నేళ్లుగా వెళ్లడం లేదు.
ఈ క్రమంలో ఎన్టీఆర్ కు షా నుంచి పిలుపు రావడం చర్చనీయాంశమైంది. ఇది రాజకీయ భేటీనా? లేదంటే ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసిన షా అందులో అద్భుత నటనతో మెప్పించిన ఎన్టీఆర్ అభినందించేందుకే పిలిచారా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏదేమైనా అమిత్ షా, తారక్ సమావేశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ గా మారింది.