Telangana: రైల్వే ఫ్లాట్‌ఫామ్ మెట్లపై పరీక్షకు సిద్ధపడుతున్న నిరుద్యోగి... పట్టుదల ఫలితమిస్తుందన్న ఐపీఎస్ అధికారిణి స్వాతి లక్రా
- తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి పలు నోటిఫికేషన్లు
- పోలీసు శాఖలో వేలాది పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
- ఉద్యోగార్థుల్లో ఉత్సాహం నింపుతూ స్వాతి లక్రా పోస్ట్
తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగాల భర్తీ కోసం పెద్ద కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేయగా... వరుసబెట్టి నోటిఫికేషన్లు వస్తున్నాయి. వీటిలో పోలీసు శాఖకు చెందిన ఖాళీలు కూడా వేల సంఖ్యలోనే ఉన్నాయి. పోలీసు ఉద్యోగమంటే... కేవలం రాత పరీక్ష మాత్రమే కాకుండా దేహ దారుఢ్య పరీక్షలో కూడా అభ్యర్థులు ఉత్తీర్ణులు కావాల్సిందే. దేహ దారుఢ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే.. రాత పరీక్షకు అర్హత లభిస్తుంది.
ఇలాంటి క్రమంలో ఇప్పటికే దేహ దారుఢ్య పరీక్షలు ముగియగా... కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో రాత పరీక్షకు రంగం సిద్ధమైంది. ఈ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు రాత్రింబవళ్లు పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటున్నారు. ఇలా పుస్తకాలను ముందేసుకుని రైల్వే ఫ్లాట్‌ఫామ్ మెట్లపై పరీక్షకు సిద్ధమవుతున్న ఓ అభ్యర్థి ఫొటోను సీనియర్ ఐపీఎస్ అధికారిణి స్వాతి లక్రా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. పట్టుదల ఉంటే ఫలితం దక్కుతుందంటూ ఆమె ఉద్యోగార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు.