Nara Lokesh: విశాఖ ఎయిర్‌పోర్టు బయట లోకేశ్ బైఠాయింపు... కొనసాగుతున్న ఉద్రిక్తత
- ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన నారా లోకేశ్
- శాంతి భద్రతల పేరు చెప్పి అడ్డుకున్న పోలీసులు
- నిరసనగా విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద బైఠాయించిన లోకేశ్
ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్‌ను ఏపీ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో లోకేశ్ పర్యటించాల్సి ఉంది. అయితే పలాస చేరుకోకముందే ఆయనను అడ్డగించిన పోలీసులు... పోలీసు వాహనంలోకి లోకేశ్‌ను ఎక్కించి విశాఖకు తరలించారు. విశాఖలో మీడియా సమావేశాన్ని నిర్వహించకుండా లోకేశ్‌ను కట్టడి చేసిన పోలీసులు మరికాసేపట్లో హైదరాబాద్ బయలుదేరనున్న విమానంలో లోకేశ్ ను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే పోలీసుల వైఖరికి నిరసనగా విశాఖ ఎయిర్ పోర్టు ప్రాంగణం బయట పార్టీ నేతలతో కలిసి నారా లోకేశ్ బైఠాయించారు. అసలు తన ఉత్తరాంధ్ర పర్యటనను ఎందుకు అడ్డుకున్నారో తెలియజేయాలంటూ లోకేశ్ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. తనకు సమాధానం చెప్పేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. లోకేశ్ తో పాటు పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో బైఠాయించారు. అదే సమయంలో లోకేశ్‌ను ఎలాగైనా హైదరాబాద్ తరలించాల్సిందేనన్న దిశగా ఆలోచిస్తున్న పోలీసులు.. పెద్ద సంఖ్యలో అక్కడికి బలగాలను తరలించారు. వెరసి విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద గంటల తరబడి ఉద్రిక్తత కొనసాగుతోంది.