Nitin Gadkari: మేమీరోజు అధికారంలో ఉండడానికి వాజ్‌పేయి, అద్వానీలే కారణం: నితిన్ గడ్కరీ

Nitin Gadkari attributes BJPs rise to power to efforts of Atal Bihar Vajpayee

  • బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించిన తర్వాత తొలిసారి కీలక వ్యాఖ్యలు చేసిన గడ్కరీ
  • చీకట్లు తొలగిపోతాయని, కమలం వికసిస్తుందని 1980లోనే వాజ్‌పేయి చెప్పారన్న కేంద్రమంత్రి
  •  వాజ్‌పేయి ఆ మాటలన్నప్పుడు తాను కూడా ఉన్నానన్న గడ్కరీ

కేంద్రంలో తామీ రోజు అధికారంలో ఉన్నామంటే అందుకు బీజేపీ అగ్రనేతలు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, అద్వానీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటివారే కారణమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వారి వల్లే పార్టీ నేడు ఈ స్థాయికి ఎదిగిందన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తనను తొలగించిన తర్వాత తొలిసారి గడ్కరీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లో నిన్న నిర్వహించిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. 1980లో ముంబైలో బీజేపీ నిర్వహించిన సదస్సులో వాజ్‌పేయి చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. 

ఆ సదస్సులో వాజ్‌పేయి మాట్లాడుతూ.. ఏదో ఒక రోజు చీకటి తొలగిపోతుందని, సూర్యుడు బయటకు వస్తాడని, కమలం వికసిస్తుందని అన్నారని గడ్కరీ పేర్కొన్నారు. ఆ సదస్సులో తానూ ఉన్నానన్నారు. నాడు వాజ్‌పేయి ప్రసంగాన్ని విన్నవారంతా అలాంటి రోజు ఒక రోజు వస్తుందని నమ్మారని పేర్కొన్నారు. వాజ్‌పేయి, అద్వానీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటివారితోపాటు కార్యకర్తల కృషి కారణంగానే నేడు మోదీ నాయకత్వంలో అధికారంలో ఉన్నామని గడ్కరీ పేర్కొన్నారు. 

రాజకీయ నాయకులు ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించే ఆలోచిస్తారని.. అయితే, దేశాన్ని, సమాజాన్ని నిర్మించాలనుకునే సమాజ, ఆర్థిక సంస్కర్తలు మాత్రం చాలా ముందు చూపుతో ఆలోచిస్తారని, వారు వచ్చే శతాబ్దం గురించి కూడా ఆలోచిస్తారన్న ఆరెస్సెస్ సిద్ధాంతకర్త దివంగత దత్తోపంత్ ఠెంగడీ గతంలో చేసిన వ్యాఖ్యలను గడ్కరీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News