K Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసుతో నాకు సంబంధం లేదు.. ఎటువంటి విచారణ అయినా చేసుకోవచ్చు:ఎమ్మెల్సీ కవిత
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు సంబంధం ఉందన్న బీజేపీ ఎంపీ
- కేసీఆర్ ను మానసికంగా కుంగదీయాలని చూస్తున్నారన్న కవిత
- బీజేపీపై పోరాటంలో తగ్గే ప్రసక్తే లేదని వ్యాఖ్య
ఢిల్లీ లిక్కర్ కేసుతో తనకు సంబంధం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ అయిన తనను బద్నాం చేస్తే... కేసీఆర్ ఆగమవుతారనే యోచనతో ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. తమ లైన్లోకి కేసీఆర్ వస్తారనే యోచనతో ఇది చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ను మానసికంగా కుంగదీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారని కవిత చెప్పారు. బట్ట కాల్చి మీద వేయాలనుకుంటున్నారని అన్నారు. కక్షపూరితంగానే బీజేపీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను తన తండ్రి కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని... దీన్ని ఓర్వలేకే ఇదంతా చేస్తున్నారని ఆమె చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదని అన్నారు. ఎటువంటి విచారణ అయినా చేసుకోవచ్చనీ, దేనికైనా పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. బీజేపీపై పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలపై కక్షపూరిత రాజకీయాలను బీజేపీ చేస్తోందని విమర్శించారు. విపక్ష నేతలపై ఏది పడితే అది మాట్లాడటం, తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కేసీఆర్ భయపడతారని అనుకుంటున్నారని... ఇది వ్యర్థ ప్రయత్నంగానే మిగిలిపోతుందని అన్నారు.
ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ఎంపీ నిన్న మీడియాతో మాట్లాడుతూ ఈ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల పాత్ర ఉందని... కేసీఆర్ కూతురు కవిత హస్తం ఉందని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే కవిత మీడియా ముఖంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.