ipl: కెప్టెన్​ మయాంక్​, కోచ్​ కుంబ్లేతో పంజాబ్​ కింగ్స్​ కటీఫ్​!

Punjab kings is going to sack captain mayank and coach kumble

  • వచ్చే సీజన్ లో కొత్త కెప్టెన్, కోచ్ ను నియమించాలని చూస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ
  • గత సీజన్లలో జట్టు పేలవ ప్రదర్శనే కారణం
  • కెప్టెన్సీ రేసులో ముందున్న జానీ బెయిర్ స్టో

ఐపీఎల్‌ 2023 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక మార్పులు జరగనున్నాయి. కొన్నేళ్లుగా తీవ్రంగా నిరాశ పరుస్తున్న నేపథ్యంలో జట్టును ప్రక్షాళన చేయాలని పంజాబ్ ఫ్రాంచైజీ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో తమ హెడ్ కోచ్ అనిల్‌ కుంబ్లేతో పాటు కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ను కూడా తప్పించేందుకు రంగం సిద్ధం చేసింది. గత మూడు సీజన్లలో జట్టు ప్రదర్శన బాగా లేకపోవడమే కుంబ్లేను తప్పించడానికి కారణంగా తెలుస్తోంది. 

ఇక కెప్టెన్‌గా మయాంక్‌ పని తీరుపై కూడా ఫ్రాంచైజీ సంతృప్తిగా లేదు. గత సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరిన కేఎల్ రాహుల్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ పంజాబ్ కెప్టెన్సీ అప్పగించింది. కానీ, 2022లో కింగ్స్ నిరాశపరిచింది, ఆరో స్థానంలో నిలిచి, మరోసారి ప్లేఆఫ్స్ దశకు అర్హత సాధించడంలో విఫలమైంది. మయాంక్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బెయిర్ స్టోను కెప్టెన్ గా నియమించే అవకాశం ఉంది.

సాధారణంగా ఓపెనింగ్ చేసే మయాంక్ గత ఎడిషన్లో  మిడిలార్డర్లో బ్యాటింగ్ కు వచ్చాడు. కెప్టెన్ గానే కాకుండా బ్యాటర్ గానూ గత సీజన్ లో అతనికి కలిసిరాలేదు. 13  మ్యాచుల్లో 16.33 సగటు, 122.50 స్ట్రైక్ రేట్‌తో 196 పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో ఐపీఎల్ తో పాటు తమ జాతీయ జట్టు ఇంగ్లండ్ తరఫున కూడా బెయిర్ స్టో దుమ్మురేపుతున్నాడు. ఈ క్రమంలో  కింగ్స్‌ జట్టుకు నాయకత్వం వహించడానికి బెయిర్ స్టో సరైన వ్యక్తి అని ఫ్రాంచైజీ భావిస్తోంది.  గత ఐపీఎల్లో 11 మ్యాచులు ఆడిన అతను 144.57 స్ట్రైక్ రేట్‌, 66  సగటుతో 253 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో కొత్త కెప్టెన్, కొత్త కోచ్ ఆధ్వర్యంలో బరిలోకి దిగాలని పంజాబ్ ఫ్రాంచైజీ నిర్ణయానికి వచ్చింది. 

‘వచ్చే సీజన్ లో మా ప్రణాళికల్లో మయాంక్‌ కెప్టెన్‌గా లేడు. అతను బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. బ్యాటర్ గా మాత్రం అతను మాకు చాలా కీలకం. కుంబ్లే విషయంలో కొన్ని అంశాలను పరిశీలిస్తున్నాం. ఇంకా తుది నిర్ణయానికి రాలేదు’ పంజాబ్ అధికారులు చెబుతున్నారు. కోచ్ గా కుంబ్లేను తప్పించి ట్రేవర్‌ బెలిస్‌, ఇయాన్‌ మోర్గాన్‌, ఇండియా మాజీ కోచ్ ల్లో ఒకరికి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News