Andhra Pradesh: మారిన కేసీఆర్ వ్యూహం మాదిరే... మా వ్యూహాలు మాకున్నాయి: పవన్ కల్యాణ్
- వైసీపీ ముక్త ఏపీ అనే నినాదంతో ఎన్నికలకు వెళతామన్న పవన్
- జనసేనలోనూ ఒకరిద్దరిలో కోవర్టు లక్షణాలున్నాయని వ్యాఖ్య
- పార్టీలోని కొందరు తనను వెనక్కు లాగే యత్నం చేస్తున్నారని వెల్లడి
- కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తానన్న నిర్ణయాన్ని కేసీఆర్ మార్చిన వైనాన్ని ప్రస్తావించిన జనసేనాని
జనసేన రాజకీయ వ్యూహంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులకు తగ్గట్టే పార్టీల వ్యూహాలు మారుతున్నట్టుగానే... జనసేన వ్యూహాలు కూడా మారుతూ ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈ మేరకు సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసీఆర్ ప్రకటించిన వ్యూహాన్ని ఆ తర్వాత ఆయన మార్చుకున్న వైనాన్ని పవన్ ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సాగిన కేసీఆర్... ఉద్యమ సమయంలో తెలంగాణను ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ప్రకటించారని పవన్ గుర్తు చేశారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చుకున్నారని పవన్ చెప్పారు. మారిన కేసీఆర్ వ్యూహం మాదిరే జనసేనకు కూడా తన వ్యూహాలు తనకున్నాయని పవన్ తెలిపారు. పాదయాత్ర సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటలను మరిచి పాలన సాగిస్తూ ఆంధ్రా థానోస్‌గా మారిపోయారని పవన్ వ్యాఖ్యానించారు.
జనసేన అంతర్గత విషయాలను కూడా ఈ సందర్భంగా పవన్ బయటపెట్టారు. జనసేనలోనూ ఒకరిద్దరిలో కోవర్టు లక్షణాలు కనిపిస్తున్నాయని పవన్ అన్నారు. పార్టీలో కొనసాగుతున్న కొందరు తనను వెనక్కు లాగే యత్నాలు చేస్తున్నారని కూడా పవన్ తెలిపారు. ఈ తరహా కుయుక్తులను దాటుకుని తాము ముందుకు సాగుతామని పవన్ చెప్పారు. వైసీపీ ముక్త ఏపీ అనే నినాదంతోనే తాము వచ్చే ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.